Kailash Vijayvargiya: నేను చాలా పెద్ద లీడర్‭ని, చేతులు కట్టుకుని ప్రజలను ఓట్లు అడగాలా..? బీజేపీ సీనియర్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

నాకు టిక్కెట్ వచ్చింది. అయితే అందుకు నేను సంతోషంగా లేను. ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక నాకు ఒక్క శాతం కూడా లేదు. ఇప్పుడు మన వాళ్లే పెద్ద నాయకులు అయిపోయారు. ఇప్పుడు చేతులు జోడించాల్సిన అవసరం లేదు

Kailash Vijayvargiya: నేను చాలా పెద్ద లీడర్‭ని, చేతులు కట్టుకుని ప్రజలను ఓట్లు అడగాలా..? బీజేపీ సీనియర్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Updated On : September 27, 2023 / 4:05 PM IST

Madhya Pradesh Election 2023: నాయకుడు ఎంత పెద్దవాడైనప్పటికీ, ఎంత సీనియారిటీ ఉన్నప్పటికీ.. ప్రజల ముందుకు వచ్చినప్పుడు చేతులు జోడించి దండం పెట్టడం భారత రాజకీయాల్లో సర్వసాధారణం. నాయకుల లోపల అహం ఎంతైనా ఉండొచ్చు, వారి వ్యక్తిత్వం మరెలాంటిదైనా కావొచ్చు, కానీ ప్రజల్లోకి వెళ్లాక రెండు చేతులు ఒక చోటుకి రావడం అనివార్యం అవుతుంది. కానీ ఇలా చేతులు జోడించి నమస్కరించడం తనకు నచ్చడం లేదని అంటున్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కైలాష్ విజయవర్గీయ.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు భాజపా తన అభ్యర్థుల రెండో జాబితాను సోమవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో చాలా మంది సీనియర్ల పేర్లు ఉన్నాయి. వీటిలో జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ కూడా ఉన్నారు. ఆయనకు ఇండోర్-1 నుంచి బరిలోకి దింపేందుకు బీజేపీ అభ్యర్థిగా ఖరారు చేసింది. అయితే తనను అభ్యర్థిని చేయడంపై ఆయనే ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, అనంతరం వివాదాదస్పంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక తనకు ఒక్క శాతం కూడా లేదని, అలాగే చాలా పెద్ద నాయకుడినైనందున ప్రజల ముందు చేతులు జోడించి ఓట్లు అడగలేనని కైలాష్ విజయవర్గీయ అన్నారు.

Maneka on Iskon: ‘ఇస్కాన్, గోవులు, కసాయి’ అంటూ సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ మేనకా గాంధీ.. ఇస్కాన్ కూడా స్పందించింది

కైలాష్ విజయవర్గియ మాట్లాడుతూ ‘‘నాకు టిక్కెట్ వచ్చింది. అయితే అందుకు నేను సంతోషంగా లేను. ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక నాకు ఒక్క శాతం కూడా లేదు. ఇప్పుడు మన వాళ్లే పెద్ద నాయకులు అయిపోయారు. ఇప్పుడు చేతులు జోడించాల్సిన అవసరం లేదు. రోజూ 8 మీటింగ్‌లు పెట్టాలి అని ఎన్నికలకు ప్లాన్ చేసుకున్నాం. హెలికాప్టర్‌లో ఐదుగురు, కారులో ముగ్గురు. ఈ విధంగా మొత్తం ఎన్నికల సమయంలో ప్రతిరోజూ 8 సమావేశాలు నిర్వహించాలి. స్పీచ్ ఇచ్చి వెళ్లిపోవడమే. దాని ప్లాన్ కూడా తయారైంది. కానీ మీరు (ప్రజలు) అనుకుంటే ఏదైనా జరుగుతుంది’’ అని అన్నారు.

ఇంతలోనే మళ్లీ మరో విరుద్ధ ప్రకటన చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘‘నేను ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్నాను. అయితే నిన్నగాక మొన్న పార్టీ సీనియర్ నేతల నుంచి నాకు ఆదేశాలు అందాయి. నేను గందరగోళంలో పడ్డాను. ఇంత హఠాత్తుగా నా పేరు ప్రకటించడంతో నేను ఆశ్చర్యపోయాను. అయితే, ఇది నా అదృష్టం. పార్టీ నన్ను ఎన్నికల్లో పోటీకి పంపింది. నేను పార్టీ సైనికుడిని. పార్టీ ఆశలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాను’’ అని కైలాష్ విజయవర్గియ అన్నారు.