విశాఖను రాజధాని చేయడం రాజకీయ కుట్ర : బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

విశాఖను రాజధానిగా చేయడం రాజకీయ కుట్ర అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. రాష్ట్రంలో అమరావతి ఒకటే రాజధాని ఉండాలన్నారు. ఈ మేరకు సోమవారం (జనవరి 13, 2020)విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాజధాని పేరుతో రెండు కులాల మధ్య రాజకీయం నడుస్తోందన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం పని చేయాలి.. కానీ రాజధాని కోసం రాజకీయం చేయకూడదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సూచించారు.
ఇటీవల రాజధాని తరలింపు అంశంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిని తరలిస్తే ఊరుకోబోమని….అమరావతిని తరిలిస్తే భారత పౌరుడిగా ఉండటం కంటే శరణార్ధిగా మరో దేశమే వెళ్లటం మేలని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతి తరలింపు అంత ఈజీ కాదని అన్ని వర్గాల ప్రజలు తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాజధాని తరలింపు ప్రతిపాదనను వెనక్కు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకు వస్తామని సుజనా చౌదరి చెప్పారు.
రాజధాని తరలిస్తే అసలు ఇక్కడ పౌరుడిగా ఉండటమే దండగని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా చూస్తూ ఊరుకుంటే నేరాలు, ఘోరాలు పెరిగిపోతాయని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఏదో జరిగిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా తనకు మద్దతుగా నిలవాలని కోరారు.
ఇదిలావుంటే రాజధాని అమరావతిలోనే ఉండాలని బీజేపీ ఏపీ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీడ్ క్యాపిటల్, సచివాలయం, రాజ్‌భవన్, అసెంబ్లీ, సీఎంవో సహా కీలక విభాగాలన్నీ అమరావతి నుంచే పనిచేయాలని పేర్కొంది. అలాగే రాజధాని కోసం ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కమిటీ సమావేశంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ చివరకు అమరావతిలోనే రాజధాని ఉంచాలని తీర్మానం చేసింది.