CBI సమన్లు : తప్పు చేయలేదన్న సుజనా

టీడీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి సీబీఐ నోటీసులు పంపింది. బెస్ట్ అండ్ కాంప్టన్ ఇంజనీరింగ్ కంపెనీతో వేలకోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేశారని సీబీఐకి పలువురు బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సుజనాచౌదరిని బెంగళూరులోని సీబీఐ కార్యాలయం ముందు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. సీబీఐ జారీ చేసిన నోటీసులపై స్పందించిన సుజనా… తనకు ఆ కంపెనీలతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
సుజనా గ్రూప్స్‌కు చెందిన బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. 2017లో హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని మూడు బ్యాంకుల్లో 364 కోట్లు రుణాలు తీసుకుంది. ఈ రుణాలను ఎగవేసినట్టు ఆంధ్రా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ… ఈ కేసులో సుజనా గ్రూప్స్‌కు సంబంధించిన కాకులమర్రి శ్రీనివాస్‌తోపాటు ఐదుగురు మేనేజింగ్ డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని… ఈడీకి ఈ కేసును బదిలీ చేస్తున్నట్టు సీబీఐ తెలిపింది.
సుజనా గ్రూప్స్‌కు చెందిన బీసీఈపీఎల్ కంపెనీ ఆంధ్రా బ్యాంక్ దగ్గర 71 కోట్ల రుణం తీసుకుంది. ఆ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు సీబీఐని ఆశ్రయించారు. దీంతో సుజనా గ్రూప్స్‌కు చెందిన పలువురు మేనేజింగ్ రెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే సుజనా గ్రూప్స్ అధినేత సుజనాచౌదరికి సీబీఐ నోటీసులు జారీ చేసింది. బెంగళూరులోని సీబీఐ కార్యాలయానికి శుక్రవారమే హాజరుకావాలని నోటీసుల్లో తెలిపింది. కానీ ఆయన సీబీఐ విచారణకు హాజరుకాలేదు. విచారణకు హాజరైతే అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ఆయన హాజరుకాలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బెస్ట్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా వందల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో…. ఈడీ గతంలోనే సుజనా గ్రూప్స్‌కు సంబంధించిన వైస్రాయ్, మహల్ హోటల్‌కు చెందిన 315 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది. చెన్నైలో ఉన్న కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు గతంలో సుజనాకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈడీ నోటీసులను సవాలు చేస్తూ సుజనా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఢిల్లీ హైకోర్టు విచారణకు హాజరుకావాలని చెప్పడంతో ఇక తప్పని పరిస్థితుల్లో ఈడీ విచారణకు హాజరై.. వివరణ ఇచ్చారు.
షెల్ కంపెనీల పేరుతో తప్పుడు ఇన్వాస్ చూపించి.. బ్యాంకు నుంచి రుణాలు పొందిన సుజనా గ్రూప్స్ సంస్థలకు గతంలో జీఎస్టీ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. జీఎస్టీ అధికారుల నోటీసులను సవాలు చేస్తూ సుజనా గ్రూప్స్ డైరెక్టర్లు కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.