నీలినీడలు : అఖిలపక్ష భేటీకి పార్టీల దూరం

విజయవాడ : చంద్రబాబు సారథ్యంలో జరిగే అఖిలపక్ష సమావేశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తెలుగుదేశం పార్టీకి.. జనసేన, కాంగ్రెస్ సహా వామపక్షాలు జలక్ ఇచ్చాయి. సమావేశానికి తాము రావడం లేదంటూ.. బహిరంగ లేఖలు రాశాయి. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం తమతో కలిసి రావాలని.. అఖిల పక్షాలు, వివిధ ప్రజా సంఘాలకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి రావాలంటూ అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపారు. అయితే.. అఖిల భేటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన, కాంగ్రెస్ పార్టీ హాజరుకాబోమని స్పష్టం చేశాయి.
ఉండవల్లి అరుణ్ కుమార్ సారథ్యంలో జరిగిన అఖిలపక్ష భేటీకి హాజరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్.. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఆల్‌పార్టీ మీటింగ్ కు హాజరుకాబోమని ప్రకటించింది. అటు జనసేన కూడా ఈ సమావేశానికి హాజరుకాకూడని నిర్ణయించింది. సీఎం చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. అఖిలపక్ష భేటీకి తమ పార్టీ దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. జనవరి 30వ తేదీ బుధవారం సమావేశం ఉంటే మంగళవారం సాయంత్రం ఆహ్వానిస్తే ఎలా అని ప్రశ్నించారు. సరైన ఎజెండా లేకుండా నిర్వహించే మొక్కుబడి భేటీలకు జనసేన దూరంగా ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై అఖిలపక్ష సమావేశం పెట్టడం హర్షణీయమన్న పవన్ కల్యాణ్ .. అఖిలపక్ష సమావేశానికి తమను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ..
అటు కాంగ్రెస్ పార్టీ కూడా అఖిలపక్ష సమావేశానికి తాము రావడం లేదని ప్రకటించింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో హోదాపై పోరాటమంటూ హడావుడి చేయడం వల్ల ప్రయోజనం ఉండదని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొంది. అధికారంలోకి వస్తే ఏపీకి హోదా ఇస్తామన్న కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటనను ప్రస్తావించింది.