హైదరాబాద్ కేంద్రంగా ఏపీ పై కుట్ర : కేసీఆర్ కు కళా వెంకట్రావు లేఖ

  • Published By: chvmurthy ,Published On : February 24, 2019 / 12:52 PM IST
హైదరాబాద్ కేంద్రంగా ఏపీ పై కుట్ర : కేసీఆర్ కు కళా వెంకట్రావు లేఖ

Updated On : February 24, 2019 / 12:52 PM IST

అమరావతి: హైదరాబాద్ కేంద్రంగా వైసీపీ , బీజేపీ తో కలిసి  కేసీఆర్ కుతంత్రాలు చేస్తున్నారని ఏపీ మంత్రి కళా వెంకటరావు ఆరోపించారు. ఏపీ అభివృధ్ధి చెందితే  భవిష్యత్ ఉండదని భయపడుతున్నారని ఆయన కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో పేర్కోన్నారు. 12 కేసుల్లో ఏ1 నిందితుడుగా ఉన్న జగన్‌కు మద్దతు ఇవ్వడంతోనే ఏపీపై కేసీఆర్‌ చేస్తున్న కుట్ర ప్రజలకు తెలిసిపోయిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. దేశం గర్వించే స్థాయిలో పోలవరం పనులు జరుగుతుంటే, అది చూసి ఓర్వలేక జగన్‌, ఒడిశా ప్రభుత్వంతో కలిసి మీ కుమార్తె చేత కేసులు వేయించలేదా? పోలవరం అడ్డుకోవడమే ధ్యేయంగా కుట్ర పన్నలేదా? అని కళా వెంకట్రావు లేఖలో రాశారు.

కేసీఆర్ కు 26 ప్రశ్నలతో రాసిన  లేఖను కళా వెంకటరావు ఆదివారం విడుదల చేశారు. చంద్రబాబు అధికారంలో ఉంటే కేసీఆర్‌, జగన్‌ ఆటలు సాగవనే భయం వారికి పట్టుకుందని చెప్పారు. దొంగ పాస్‌పోర్టులతో కేసీఆర్‌, దొంగ కంపెనీలతో జగన్ ప్రస్థానాలు ప్రారంభమయ్యాయని కళా వెంకట్రావు  విమర్శించారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న ఏపీ శాసనసభ్యులను బెదిరించి ఐటి దాడులు చేయించారని, వైసీపీ నేతల ఆస్తులకు మీ ప్రభుత్వం ఎందుకు అండగా నిలిచిందని ఆయన అన్నారు. ఆస్తుల్ని కరిగించి అప్పుల రాష్ట్రంగా మార్చిన మిమ్మల్ని జగన్‌ పత్రికలో వీరుడు, సూరుడు అంటూ.. అప్పుల్ని ఎదురించి ఆస్తులు సృష్టించిన చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వార్తలు రాయడం మీ మధ్య లాలూచికి నిదర్శనం కాదా.? అని కళా ప్రశ్నించారు.