సర్వం సిద్ధం : పంచాయతీ ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చు
హైదరాబాద్: తెలంగాణా రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పంచాయతీ రాజ్ శాఖ నుంచి రిజర్వేషన్ల జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘంకు చేరడంతో ఇక నోటిఫికేషన్ విడుదలకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈనెల మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్న ఎస్ఈసీ క్షేత్రస్దాయిలో ఎన్నికల నిర్వాహణ ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. ఎన్నికల సంఘం ఇప్పటికే సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మరో విడత ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు అధికారులు.
రాష్ట్రంలోని 12,751 గ్రామపంచాయితీల్లో కోటి నలభై తొమ్మిది లక్షల 73 వేల మంది ఓటర్లు ఉన్నారు. పంచాయితీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నాం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ.. మధ్యాహ్నాం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదటగా సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారని ఆ తరువాత వార్డు మెంబర్ల ఓట్లు లెక్కించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఆ తరవాత నోటీసులు ఇచ్చి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా చేపడతామన్నారు.
గత పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల సంఘానికి ఖర్చుల వివరాలు సమర్పించని 12,716 మందిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. రాబోయే ఆరు సంవత్సరాల పాటు వీళ్లు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయరాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 5 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయితీల్లో సర్పంచ్ అభ్యర్దులు 2 లక్షల 50 వేల వరకు వ్యయపరిమితి ఉంటుందని, 5 వేల కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామపంచాయితీల సర్పంచ్ అభ్యర్ధులు లక్షా 50 వేల వరకు ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని సూచించారు. కాగా 5 వేల కన్నా ఎక్కువ జనాభా కలిగిన పంచాయితీల్లో వార్డు మెంబర్లు 50 వేలు ఎన్నికల ఖర్చు ఉంటుందని… 5 వేల కన్నా తక్కువ జనాభా కలిగిన పంచాయితీల్లో వార్డు మెంబర్ అభ్యర్ధులు 30 వేల వ్యయపరిమితి ఉన్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
పంచాయితీ ఎన్నికల్లో రేషన్ డీలర్లు కూడా పోటీ చేయవచ్చునన్న ఎన్నికల సంఘం… ఇద్దరు సంతానానికి మించి ఉంటే పోటీకి అనర్హులని తేల్చి చెప్పింది. అంతేగాక ఇద్దరు భార్యలు ఉన్న పంచాయితీల్లో నలుగురు సంతానం ఉంటే భార్యలు పోటీ చేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 95 వేల బ్యాలెట్ బాక్సులను ఎన్నికలకు సిద్దం చేశామని… ఎన్నికల గుర్తులను కూడా ఇప్పటికే సిద్దం చేసినట్లు స్పష్టం చేశారు. ఒక గుర్తు మరో గుర్తును పోలీ ఉండే అవకాశం లేదని… అభ్యర్ధులు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా సర్పంచ్, వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయితే మంచిదే కాని, వేలం పాట వేసి… భయబ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవంగా ప్రకటిస్తే సంబంధిత జిల్లా కలెక్టర్లతో విచారణ జరుపుతామని ఎన్నికల అధికారులు తెలిపారు.