కరోనా భయం : తెలంగాణలో 5 కేసులు

కరోనా భయంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావడంలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 5 కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కోలుకుంటున్నాడు. కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.
కరోనాపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం … దాని కట్టడికి చర్యలు తీసుకుంటోంది. అయినా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 2020, మార్చి 17వ తేదీ మంగళవారం కొత్తగా ఒక కేసు నమోదైంది. కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కరోనా సోకలేదని ఈటల ప్రకటించారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో.. బాధితులంతా బయటి దేశాల నుంచి వచ్చిన వారేనని స్పష్టం చేశారు.
ఒక వ్యక్తి ఇప్పటికే కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడని మిగిలిన నలుగురికి ట్రీట్ మెంట్ ఇస్తున్నామన్నారు. కరోనా సోకిన ఐదుగురు దుబాయ్, ఇటలీ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, ఇండోనేషియా నుంచి వచ్చినవారేనన్నారు ఈటల. చైనా, ఇటలీ, స్పెయిన్, కొరియా దేశాల నుంచి వచ్చే వారిని రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కరోనా క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నామన్నారు ఈటల. వరంగల్‌లో కరోనా వైరస్ టెస్ట్ ల్యాబ్ కోసం కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు.
రాష్ట్రంలో మొత్తం ఆరు ల్యాబ్‌లు కరోనా టెస్టులు చేస్తున్నాయని, అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో థర్మల్ స్క్రీనింగ్ సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. కరోనా ఎదుర్కోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారిని దూలపల్లి, వికారాబాద్‌లో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
వారిలో కరోనా లక్షణాలు లేకున్నా వారిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించాలని నిర్ణయించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని క్వారంటైన్‌లో ఉంచుతోంది. ఇప్పటివరకు దాదాపు 200 మందికిపైగా క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందించినట్టు ఈటల ప్రకటించారు.