ప్రకాశం వైసీపీలో వర్గపోరు : టిక్కెట్ల కోసం నేతల కొట్లాట
ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్ధితి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌లా ఉంది.

ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్ధితి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌లా ఉంది.
ప్రకాశం : జిల్లా వైసీపీలో వర్గపోరు పార్టీని ఇబ్బందిపెడుతోంది. ఓ పక్క టిక్కెట్ల కోసం ఆశావహులు మధ్య రోజురోజుకూ పోటీ పెరుగుతోంది. మరోపక్క గెలుపు గుర్రాలపై అధిష్టానం కూడా ఎటూ తేల్చుకోలేకపోతోంది. నాలుగేళ్లుగా జెండామోసిన తమను కాదని కొత్త అభ్యర్ధులను ఫైనల్ చేస్తే రెబల్‌గానైనా బరిలో దిగుతామంటూ కొందరు ఖరాఖండీగా చెబుతుంటే.. మరికొన్ని చోట్ల అసలు ధీటైన అభ్యర్ధులు లేక పార్టీ సతమతమవుతోంది. అసలు ఎవరికి సీటు దక్కుతుందో తెలియక .. కార్యకర్తలు తలపట్టుకుంటున్నారు.
ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్ధితి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌లా ఉంది. పైకి చూడటానికి ప్రశాంతంగా ఉన్నా లోపల మాత్రం కుత కుతలా ఉడుకుతూనే ఉంది. జిల్లాలో జగన్ కు నమ్మిన బంటులైన వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు పెద్ద నాయకులున్నా.. పార్టీ పరిస్ధితిని చక్కదిద్దలేకపోతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ధీటైన అభ్యర్ధులు దొరక్క ఫ్యాను పార్టీ ఇబ్బదిపడుతోంది. కాస్తో కూస్తో పార్టీ బలంగా ఉందనుకుంటున్న నియోజకవర్గంలో టిక్కెట్ నాకు ఇవ్వక పోతే స్వతంత్ర అభ్యర్దిగా బరిలో దిగుతానంటూ నేతుల బెదిరిస్తున్నారు. అది కూడా సొంత పార్టీ అభ్యర్ధిని ఓడిస్తానంటూ హెచ్చరిస్తున్నారు.
జిల్లాలోని మొత్తం 12 నియోజకవర్గాల్లో పశ్చిమ ప్రకాశం కాస్త ఆశాజనకంగా ఉన్నా.. మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్ధితి అయోమయంగా ఉంది. ముఖ్యంగా చీరాల, అద్దంకి, పర్చూరు, కొండేపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్దులు ఎవరో అర్దం కాని పరిస్తితి నెలకొంది. ప్రస్తుతానికి నియోజకవర్గ సమన్వయకర్తలుగా నేతలున్నా.. వారు ఎన్నికల బరిలో దిగుతారో లేదోననే కన్ఫ్యూజన్.. పార్టీ కార్యకర్తల్లో నెలకొంది.
చీరాల వైసీపీలో బలమైన నేతల లేరు. ప్రస్తుతం ఇక్కడ యడం బాలాజీ సమన్వయ కర్తగా ఉన్నా .. పెద్దగా ప్రభావితం చూపగల నాయకుడు కాకపోవడంతో.. బలమైన అభ్యర్ధిని ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడమా .. లేక స్థానిక ఎమ్మెల్యే ఆమంచిని పార్టీలోకి తీసుకురావడమా అన్న చర్చ సాగుతోంది. ఒకవేల బలమైన అభ్యర్ధిని దిగుమతి చేసుకోవాలని భావిస్తే.. ఆమంచిని ఢీకొట్టే నాయకుడు ఎవ్వరనే సమస్య.. అధిష్టానాన్ని వెంటాడుతోంది.
అద్దంకిలోనూ పరిస్ధితి సేమ్. ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టిపాటి రవి వైసీపీలో గెలిచి టీడీపీలో కొనసాగుతున్నారు. గొట్టిపాటి రవికి ధీటుగా ఎన్నికల బరిలో నిలబడే వ్యక్తి ప్రస్తుతం లేకపోవడం ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక నియోజకవర్గం సమన్వయకర్తగా ఉన్న బాచిన చెంచుగరటయ్య ఎన్నికల నాటికి పోటీలో ఉంటారా లేదా అనేది ప్రశ్నార్ధకమే. దీంతో ఎన్నికల సమయానికి చెంచుగరటయ్యకు బదులు మరో బలమైన వ్యక్తిని తెస్తారా అనే సందిగ్దంలో నేతలు, కార్యకర్తలున్నారు.
పర్చూరు నియోజకవర్గం పేరు ఇటీవల రాష్ట్ర రాజకీయాళ్లో బాగా వినిపించింది. దీనికి కారణం దగ్గుబాటి వారుసుడు రాజకీయ అరంగేట్రం చేయ్యడమే. ఇంత వరకూ బాగానే ఉన్నా ఇక్కడ వైసీపీకి అన్ని తానై నిలిచిన రావిరామనాధ బాబు వైసీపీ బుజ్జగింపులకు తలొగ్గుతారా .. లేక రెబల్‌గా మారుతారా అనే అనుమానాలు .. పార్టీని వేధిస్తున్నాయి.
కొండేపీ నియోజకవర్గ పార్టీలోనూ వర్గపోరు తారాస్తాయికి చేరుకొంది. దీనికి ప్రధాన కారణం ఇక్కడ నియోజకవర్గం సమన్వయకర్తగా పనిచేసిన వరికూటి అశోక్ బాబు.. జూపూడి టీడీపీకి వెల్లిననాటి నుంచి సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తూవచ్చారు. అయితే ఒక్కసారిగా పార్టీ .. నుంచి అతన్ని బహిష్కరించి డాక్టర్ మాదాసి వెంకయ్యను తెరపైకి తేవడంతో ఆగ్రహించిన అశోక్ బాబు ఆమరణ నిరాహర దీక్ష కూడా చేపట్టారు. అంతేకాదు ఇప్పటికీ తనకే సీటు కన్‌ఫామ్ అనే భావనతో ప్రచారం చేస్తూన్నారు. వైసీపీ సీటివ్వని పక్షంలో స్వతంత్ర అభ్యర్దిగా బరిలో నిలిచి .. సత్తా చాటుతానని బహిరంగంగానే చెబుతున్నారు.
సంతనూతలపాడు నియోజకవర్గంలో అభ్యర్ది ఎవరు అనేది సొంత పార్టీ నేతలు తేల్చుకోలకపోతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న టీజేఆర్ సుధాకర్‌బాబు .. చివరి వరకు ఉంటారా.. లేక పార్టీ సీటు ఆశిస్తున్న దార సాంబయ్య కూతురుని పార్టీలోకి తెస్తారా అనే అనుమానాలు కార్యకర్తలను ఆలోచింపచేస్తున్నాయి. సుధాకర్‌బాబుకు స్వతహాగా ఆర్ధికస్తోమత లేకపోవడంతో ఇక్కడ ఆర్ధికంగా పరిపుష్టికలిగిన ఎస్సీ మాదిగ సామాజికవర్గ అభ్యర్ధి కోసం ఆ పార్టీ అన్వేశిస్తోంది. మరోవైపు .. గిద్దలూరులో కూడా పరిస్థితి అలాగే ఉంది. ఎన్నికల సమయం తరుముకొస్తున్న వేళ.. వైసీపీని పట్టిపీడిస్తున్న వర్గపోరు.. నాయకత్వంలోటు అగాధాలను పూడ్చుకుంటుందో లేదో చూడాలి.