ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం : హైకోర్టులో ఫైనల్ అఫిడవిట్ దాఖలు

ఆర్టీసీ సమ్మెలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. నవంబర్ 16వ తేదీ శనివారం ఎండీ సునీల్ శర్మ ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. కార్మికుల డిమాండ్లు పరిష్కరించలేమని మరోసారి తేల్చిచెప్పింది ప్రభుత్వం.
ఆర్టీసీ కార్పొరేషన్ పూర్తిగా నష్టాల్లో కూరుకపోయిందని, కార్మికుల ఆర్థికపరమైన డిమాండ్లు తీర్చలేమని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తాత్కాలికంగా విలీనం డిమాండ్‌ను యూనియన్ నేతలు పక్కన పెట్టినా..ఏ క్షణమైనా వారు ఆ డిమాండ్‌తో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ సొంత ఉనికి కోసం యూనియన్ నేతలు సమ్మె చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని, చర్చలు జరపలేమని అఫిడవిట్‌లో కోరారు.
ఆర్టీసీ సమ్మె, జీత భత్యాలు, ఇతరత్రా అంశాలపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 18వ తేదీ సోమవారంకు వాయిదా వేసింది కోర్టు. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ అఫిడవిట్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. విలీనం డిమాండ్‌ను తాము పక్కన పెడుతున్నట్లు, మిగతా డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ ఇటీవలే ప్రకటించింది. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలని కోరింది.
అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. అప్పటి నుంచి దశల వారీగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. కోర్టు సూచనతో చర్చలు జరిగినా..అవి సఫలం కాలేదు. విలీనం అయ్యే ప్రస్తక్తే లేదని, 5100 రూట్లను ప్రైవేటు వారికి అప్పచెబుతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ కీలక నేతలు నిరహార దీక్షకు కూర్చొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ అఫిడవిట్ దాఖలతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
Read More : ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు