బీజేపీలో చేరిన మోత్కుపల్లి

తెలంగాణ టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సోమవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి తెలంగాణ ఎన్నికల ముందు టీడీపీ లోంచి బయటకు వచ్చి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాతి కాలంలో ఆయన టీడీపీ పై తీవ్రస్ధాయిలో విమర్శలు చేయటంతో మే 28, 2018న ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
తదనంతర పరిణామాల్లో ఆయన టీఆర్ఎస్ లో చేరతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. కానీ మోత్కుపల్లి చేరలేదు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆలేరు నియోజకవర్గం నుంచి బీఎల్ఎఫ్ మద్దతుతో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయన చాలా కాలం మౌనంగా ఉన్నారు.
ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆయన్ను పార్టీలో చేర్చుకోటానికి ప్రయత్నించింది. అందులో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలు ఆయన ఇంటికి వెళ్ళి పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారు. పార్టీలో మంచి గౌరవం దక్కుతుందనే హమీ మేరకు ఆయన ఈ రోజు బీజేపీలో చేరారు.
మోత్కుపల్లితో పాటు ఢిల్లీలో అమిత్ షాను కలిసిన వారిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఆ పార్టీ నాయకులు వివేక్ వెంకటస్వామి, ఎంపీ గరికపాటి మోహన్‌రావు, వీరెందర్ గౌడ్‌లు ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను లక్ష్మణ్ అమిత్ షాకు వివరించారు.