ఆ ఇద్దరు ఎమ్మెల్యేల గొడవతో ఆందోళనలో కాంగ్రెస్, బీఆర్ఎస్..! కారణం ఏంటి?
ఈ వివాదం వెనుక ఏం జరిగింది...కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక కారణాలేంటనే కోణంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు.

Gossip Garage : ఆ ఇద్దరి మధ్య వార్ ఎవరికి అడ్వాంటేజ్…? సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోడానికి ఇద్దరూ ఆడిన గేమ్… పార్టీలకు సెల్ఫ్ గోల్‌గా అయ్యిందా? ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి వివాదం ఇలాంటి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది…. ఏ వ్యవహారంలోనైనా ఒకరికి లాభం.. మరొకరికి నష్టం ఉంటుంది.. కానీ, ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్ కూడా తీవ్ర విచారంలోనే ఉన్నాయట.. స్థానిక ఎన్నికల ముందు రేగిన ఈ రచ్చ నష్టం చేస్తుందనే టెన్షన్‌తో అగ్రనాయకత్వాలు తలలు పట్టుకుంటున్నాయంటున్నారు. ఎమ్మెల్యేల పొలిటికల్ వార్‌లో అసలు ట్విస్టు ఏంటి?
అనసవర వ్యాఖ్యలు, దాడులతో మేలు కన్నా నష్టమే ఎక్కువ?
పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య వార్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ పరస్పరం సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ డ్రామాను రక్తి కట్టిస్తున్నా.. రెండు పార్టీల అధిష్టానాలు లోలోన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలకు మద్దతుగా ఆయా పార్టీల నేతలు రోడ్డుపైకి వస్తున్నా… అనసవర వ్యాఖ్యలు.. దాడులతో మేలు కన్నా నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉందని అటు కాంగ్రెస్.. ఇటు బీఆర్ఎస్ అగ్ర నేతలు అనుమానిస్తున్నారంటున్నారు. అందుకే నష్ట నివారణ చర్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు ప్రయత్నాలు చేస్తుండగా, ఈ ఇష్యూని ఎలా ముగించాలా? అని బీఆర్ఎస్ అధిష్టానం ఎదురుచూస్తోందంటున్నారు.
బీఆర్ఎస్ ని షాక్‌కి గురిచేసిన కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు..
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్‌గా నియమించడంపై రేగిన వివాదం… బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో తీవ్ర దుమారానికి దారితీసింది. గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పేందుకు ఆయన ఇంటికి వెళతానని చెప్పిన కౌశిక్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుంటే… గాంధీ ఏకంగా అనుచరులను వెంటబెట్టుకుని కౌశిక్‌రెడ్డి విల్లాకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. ఈ సందర్భంగా ఆంధ్రా వాసిగా గాంధీని ఉద్దేశిస్తూ కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీని షాక్‌కు గురి చేశాయంటున్నారు.
సెటిలర్లలో భయం పోగట్టడం వల్లే రాజధాని ప్రాంతంలో బీఆర్‌ఎస్‌కు 17 సీట్లు..
తెలంగాణ ఉద్యమం ముగిసిన తర్వాత సెటిటర్లకు భద్రత కల్పించడంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో బాధ్యత తీసుకున్నారని చెబుతుంటారు. సెటిలర్లలో భయం పోగట్టడం వల్లే రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేక ఫలితాలు వచ్చినా… సెటిలర్లు ఎక్కువగా ఉన్న రాజధాని ప్రాంతంలో బీఆర్ఎస్ 17 సీట్లు సాధించిందని గుర్తుచేస్తున్నారు బీఆర్‌ఎస్ నేతలు. ఇక సెటిలర్ల తరఫున గెలిచిన వారిలో ఒక్క అరికెపూడి గాంధీ మాత్రమే పార్టీ మారగా, బీఆర్ఎస్‌లోనే మిగిలిన ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ వినిపించని మాట..
ఇక తాజా వివాదంలో సీమాంధ్రపై విద్వేషం రగిల్చేలా కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్‌లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోందంటున్నారు. అధినేత కేసీఆర్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో నష్ట నివారణ చర్యలపై బీఆర్ఎస్ పెద్దలు రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ వినిపించని మాట.. ఇప్పుడు అనడంతో సెల్ఫ్ గోల్ అయ్యామా? అని బీఆర్ఎస్ టెన్షన్ పడుతోందంటున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రగల్చాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించడం ద్వారా బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు.
ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చినట్లు భావన..
ఇక బీఆర్ఎస్‌లో ఇలాంటి చర్చ జరుగుతుండగా, కాంగ్రెస్ కూడా ఈ ఇష్యూని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే గాంధీ టెక్నికల్‌గా బీఆర్ఎస్ అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ లో చేరడం వల్ల అధికార పార్టీ నేతగానే వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షం విమర్శిస్తే ప్రతి విమర్శలు చేస్తే సరిపోయే అంశాన్ని సీరియస్‌గా మార్చి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చినట్లు భావిస్తోంది. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చినట్లు.. ప్రభుత్వంలో ఉన్నవారు సంయమనంతో వ్యవహరించాల్సిందిపోయి.. విపక్షం రెచ్చగొడితే రెచ్చిపోవాల్సిన అవసరం ఏంటని కాంగ్రెస్ పెద్దలు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ వచ్చాక శాంతిభద్రతల సమస్య పెరిగిందా?
సహజ సిద్ధంగా కౌశిక్‌రెడ్డి దూకుడుగా మాట్లాడుతుంటారని… అలాంటి ఆయనకు మాటలతోనే సమాధానం చెబితే సరిపోయేదని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే విపక్ష నేత ఇంటికి వందల మందితో దాడికి వెళ్లడం రాంగ్ సిగ్నల్ ఇచ్చినట్లేనని ప్రభుత్వం భావిస్తోందంటున్నారు. కాంగ్రెస్ వచ్చాక శాంతిభద్రతల సమస్య పెరిగిందనే ఒపీనియన్ జనాల్లోకి వెళుతుందని అంటున్నారు. అందువల్లే నష్ట నివారణకు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పోలీసులతో సమీక్ష నిర్వహించారని చెబుతున్నారు.
Also Read : ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరు? మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ కసరత్తు..
వివాదం వెనుక ఎవరున్నారు? సీఎం రేవంత్ ఆరా..
ఇదే సమయంలో ఈ వివాదం వెనుక ఏం జరిగింది…కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల వెనుక కారణాలేంటనే కోణంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లకుండా గాంధీని పోలీసులు నిలువరించకుండా వదిలేయడమేంటని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎవరైనా పోలీసులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించి దాడులను పరోక్షంగా ప్రోత్సహించారా? అని ప్రభుత్వం అనుమానిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న పోలీసులు, వారి నేపథ్యం పరిశీలించాల్సిందిగా ఇంటెలిజెన్స్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎమ్మెల్యేల వార్ రెండు పార్టీలను టెన్షన్‌లో పడేసిందనే టాక్ వినిపిస్తోంది. వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడి.. ఏకంగా పార్టీల ఇమేజ్ ను ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు డ్యామేజ్ చేశారంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ వివాదం ముగింపునకు ఏ పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది చూడాలి.