తెలంగాణ కాంగ్రెస్‌పై కర్ణాటక స్కామ్ ఎఫెక్ట్? బీఆర్ఎస్‌కు కొత్త అస్త్రం దొరికిందా?

అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన కర్ణాటక కాంగ్రెస్.. ఇప్పుడు అదే స్థాయిలో ఇబ్బందులకు గురి చేయడమే స్థానిక నేతలకు మింగుడు పడటం లేదని చెబుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌పై కర్ణాటక స్కామ్ ఎఫెక్ట్? బీఆర్ఎస్‌కు కొత్త అస్త్రం దొరికిందా?

Gossip Garage : తెలంగాణ కాంగ్రెస్‌పై కర్ణాటక ఎఫెక్ట్ పడుతోందా? అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత కర్ణాటకలో జెండా ఎగురవేసిన కాంగ్రెస్‌కు ఆ తర్వాత తెలంగాణలో హైప్ వచ్చింది. ఇప్పుడు కష్టాలు కూడా కర్ణాటకలో మొదలై.. తెలంగాణకు వ్యాపిస్తున్నాయా? అన్న అనుమానాలు ఎక్కువవుతున్నాయి.. కర్ణాటకలో వ్యవహారాలను ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో హస్తం నేతలను ఇరుకున పెట్టేలా ప్రతిపక్షం విమర్శలు ఎక్కుపెట్టడమే ఆసక్తిగా మారింది. ఇంతకీ కర్ణాటకలో ఏం జరిగింది? తెలంగాణ సర్కారును ఎందుకు తప్పుబడుతున్నారు..

బీఆర్ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్లైంది..
తెలంగాణలో సర్కార్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్… అధికారంలోకి వచ్చిన నుంచి ప్రతిపక్షం బీఆర్ఎస్ పై పైచేయి సాధిస్తూ వస్తోంది. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షిస్తూ బీఆర్ఎస్‌పై మాటల దాడి చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ ఒప్పందాలపై విచారణ కమిషన్ నియమించి బీఆర్‌ఎస్‌ పెద్దలను టార్గెట్‌ చేసింది. అప్పుల అంశంతో మొదలుకొని ప్రతి విషయంలో గత ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ సీఎం రేవంత్ రెడ్డి చెడుగుడు ఆడుతున్నారు. తాజాగా హైడ్రా అంశాన్ని బేస్ చేసుకొని మరింతగా విమర్శల దాడి చేస్తోంది కాంగ్రెస్‌. సీఎం రేవంత్ అటాక్‌తో బీఆర్ఎస్ శిబిరం మొత్తం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే అనుకోని వరంలా కర్ణాటకలో వాల్మికి కుంభకోణం వెలుగుచూడటంతో బీఆర్ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్లైంది. ఈ అస్త్రంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రివర్స్‌ అటాక్‌ మొదలుపెట్టింది గులాబీదళం.

తెలంగాణలో అధికారంలోకి రాక ముందు.. ఇక్కడ పార్టీకి రోల్ మోడల్ కర్ణాటక కాంగ్రెస్ అంటూ విస్తృత ప్రచారం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇక్కడ పార్టీకి మంచి జోష్ వచ్చింది. ఇప్పుడు తాజాగా సేమ్ టు సేమ్ కర్ణాటక వ్యవహారం.. తెలంగాణ కాంగ్రెస్ మెడకు చుట్టుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కర్ణాటకలో వాల్మీకి కుంభకోణం వెలుగులోకి రావడం… ఆ పథకం లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణతో సిట్ దర్యాప్తు చేస్తోంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం 12 మంది అధికారులపై వేటు వేసింది.

కర్ణాటక స్కాంను అందిపుచ్చుకుని ప్రభుత్వంపై బీఆర్ఎస్ అటాక్‌..
సంబంధిత మంత్రి కూడా రాజీనామా చేశారు. ఇదంతా బాగానే ఉన్నా.. సిట్ దర్యాప్తులో హైదరాబాద్ లింక్ లు బయటపడటమే స్థానిక నేతలకు ఇబ్బందికరంగా మారింది. పలు ఐటీ కంపెనీలతోపాటు స్థానిక కాంగ్రెస్ నేతల కంపెనీలకు డబ్బులు మళ్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో బీఆర్‌ఎస్‌ కర్ణాటక స్కాంను అందిపుచ్చుకుని ప్రభుత్వంపై అటాక్‌ చేస్తోంది. ఎన్నికల ముందు కర్ణాటక నుంచి తప్పుడు ధ్రువపత్రాలతో డబ్బును హైదరాబాద్ తరలించారని ఆరోపిస్తూ కాకపుట్టిస్తున్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.

కొందరు ముఖ్య నేతలు అరెస్టు అయ్యే అవకాశం..?
వాల్మీకి స్కామ్ వ్యవహారం రోజురోజుకు ముదురుతుండటంతో అటు కర్ణాటక, ఇటు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు కష్టాలు ఎక్కువవుతున్నాయంటున్నారు. ఈ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగితే.. కొందరు ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయంగా ఆసక్తిరేపుతోంది. ఈ పరిణామాలు మునుముందు కాంగ్రెస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ హీట్‌ పుట్టిస్తోంది. అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన కర్ణాటక కాంగ్రెస్.. ఇప్పుడు అదే స్థాయిలో ఇబ్బందులకు గురి చేయడమే స్థానిక నేతలకు మింగుడు పడటం లేదని చెబుతున్నారు.