పోలవరం టికెట్‌ కోసం టీడీపీలో తీవ్రపోటీ.. రేసులో ఆ నలుగురు

వైసీపీలో అభ్యర్థుల మార్పుతోపాటు, సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో ఈసారి కచ్చితంగా గెలుస్తామని అంచనా వేసుకుంటున్న టీడీపీ నాయకులు ఎలాగైనా టికెట్‌ సాధించాలని ప్రయత్నిస్తున్నారు.

పోలవరం టికెట్‌ కోసం టీడీపీలో తీవ్రపోటీ.. రేసులో ఆ నలుగురు

Polavaram, TDP

Updated On : January 25, 2024 / 10:31 AM IST

Polavaram TDP Ticket : అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఆశావహుల్లో సందడి ఎక్కువవుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షం టీడీపీలో టికెట్‌ ఫైట్‌ రానునాను పెరుగుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ బలంగా ఉన్న పోలవరం నియోజకవర్గంలో ముగ్గురు నేతలు టికెట్‌ కోసం ప్రయత్నిస్తుండగా, అటు జనసేన కూడా ఈ సీటుపై కర్చీఫ్‌ వేయాలని ప్లాన్‌ చేస్తుండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ స్ట్రాంగ్‌ క్యాడర్‌, లీడర్లు ఉన్న నియోజకవర్గాల్లో పోలవరం ఒకటి. ఎస్‌టీ రిజర్వుడు నియోజకవర్గంమైన పోలవరంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత 8 ఎన్నికలు జరిగితే 5 సార్లు ఆ పార్టీయే గెలిచింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కాంగ్రెస్‌ హయాంలో రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాలరాజుపై నియోజకవర్గంలో వ్యతిరేకత పెరిగిందనే ఆలోచనతో ఆయనను తప్పించి బాలరాజు భార్య రాజ్యలక్ష్మిని బరిలోకి దింపుతోంది వైసీపీ. ఈ పరిణామం తమకు కలిపి వస్తుందని భావిస్తున్న టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే టికెట్‌పై ఆశలు పెంచుకుంటున్నారు.

Also Read : వైసీపీలో భారీ మార్పులు, చేర్పులు.. జగన్‌ చతుర్ముఖ వ్యూహం ఎలాంటి ఫలితం ఇవ్వనుంది?

వైసీపీలో అభ్యర్థుల మార్పుతోపాటు, సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో ఈసారి కచ్చితంగా గెలుస్తామని అంచనా వేసుకుంటున్న టీడీపీ నాయకులు ఎలాగైనా టికెట్‌ సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జిగా బొరగం శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత విధానాలపై అలుపెరగని విధంగా పోరాడుతున్న శ్రీనివాసరావు.. టికెట్‌ తనకే వస్తుందన్న నమ్మకంతో పనిచేసుకుంటున్నారు. ఐతే ఆయనకు పోటీగా మాజీ ఎమ్మెల్యే ముడియం లక్ష్మణరావు కుటుంబానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు టీడీపీ టికెట్‌ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ముడియం సూర్యచంద్రరావు తాత తండ్రుల నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆయన తాత ముడియం లక్ష్మణరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సూర్యచంద్రరావు తండ్రి కూడా ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆర్థికంగా స్థితిమంతులైన ముడియం కుటుంబమైతే బాగుంటుందనే ప్రతిపాదన కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టీడీపీకి ఈ నియోజకవర్గంలో ఓ సెంటిమెంట్‌ కూడా ఉందంటున్నారు.

Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి కమలం పార్టీ! బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే?

పోలవరం నియోజకవర్గం నుంచి గతంలో టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఎక్కువ మంది మెట్టగూడెం గ్రామానికి చెందిన వారే. ఆ ఊరి నుంచి ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేసినా, విజయం పక్కా అనే సెంటిమెంట్‌ ఉందంటున్నారు. దీంతో అదే గ్రామానికి చెందిన సూర్యచంద్రరావు సెంటిమెంట్‌తో అధిష్టానాన్ని ఆకట్టుకోవాలని చూస్తున్నారు. వీరిద్దరితోపాటు మాజీ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాసరావు కూడా తాను కూడా పోటీలో ఉన్నాననే సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు మహిళా నేత శశికళ కూడా మహిళా రిజర్వేషన్‌ కోటాలో టికెట్‌ ఆశిస్తున్నారు. శశికళ కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన మహిళా నాయకురాలు కావడంతో ఆమె పేరును అధిష్టానం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read : వైఎస్‌ కుటుంబంలో రాజకీయ యుద్ధం.. షర్మిలతో జగన్‌కు చిక్కులు తప్పవా?

ఇలా టీడీపీలో నలుగురి మధ్య టికెట్‌ కోసం పోటీ ఉండగా, మిత్రపక్షం జనసేన కూడా పోలవరం కోసం ప్రయత్నిస్తుండటంతో పసుపు పార్టీ నేతలు టెన్షన్‌ పడుతున్నారు. జనసేన నేత చిర్రీ బాలరాజు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పొత్తుల్లో పోలవరం సీటును జనసేనకు కేటాయించేలా చూడాలని జనసేన నాయకత్వంపై ఒత్తిడి చేస్తున్నారు బాలరాజు. దీంతో పోలవరం సీటుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేన నుంచి మొత్తం ఐదుగురు నేతలు పోటీపడుతుండటం.. ఇప్పటికే వైసీపీ కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపనుండటంతో పోటీ హోరాహోరీగా ఉండే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు.