ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూకుడుతో BRSకు కొత్త చిక్కులు

అసలే ఓటమి భారంలో ఉన్న brsకి కవిత వ్యవహారం రాజకీయంగా మరింత ఇబ్బందికర పరిస్థితులు తెస్తుందన్న చర్చ సాగుతోంది.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూకుడుతో BRSకు కొత్త చిక్కులు

mlc kalvakuntla kavitha turns brs party troublemaker explained here

MLC Kalvakuntla Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయాల్లో వివాదాస్పదంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగా అవతరించిన అనంతరం.. పార్టీ ఓవైపు కవిత మరోవైపు అన్న చందంగా పరిస్థితులు మారిపోతున్నాయి. పార్టీతో సంబంధం లేకుండా కవిత సొంత ఎజెండా తెరపైకి తెస్తుండడంతో ఈ ఎజెండా పార్టీకి లాభమా నష్టమా అన్న చర్చ గులాబీ నేతల్లో మొదలైంది.

కవిత వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
గులాబీ బాస్ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. పార్టీ అధినేత కూతురుగా ఉద్యమ సమయంలో ఆమె వ్యవహహరించిన తీరు ప్రజల్లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. తెలంగాణ జాగృతి పేరుతో ప్రజలను ఉద్యమం వైపు మళ్ళించడంతో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ రాజకీయాలు ఆమె చుట్టూ కూడా తిరిగాయి. 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పార్టీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో నిజామాబాద్ పార్లమెంట్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. 2019లో రెండోసారి పార్టీ ఎంపీగా పోటీ చెసే అవకాశం ఇచ్చినా విజయం సాధించలేకపోయారు. ఆ తర్వాత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆమె ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అధినేత ఆదేశాలు లేనిదే నేతలు మాట్లాడని పరిస్థితుల్లో కవిత అనుసరిస్తున్న వ్యూహం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు.

గులాబీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా అవతరించిన అనంతరం జాతీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలను తప్పు పట్టారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం బిజెపికి టిఆర్ఎస్ చేరువ అవుతుందన్న సంకేతాలను ఇచ్చినట్లు అయిందని రాజకీయంగా చర్చ జరిగింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా జై సీతారాం అంటూ ఆమె చేసిన ట్వీట్ కొత్త చర్చకు దారితీసింది. కోట్లాదిమంది భారతీయులు ఎదురుచూస్తున్న రామ జన్మభూమిలో మందిర నిర్మాణ కల సాకారమైందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన అధికార పార్టీ 
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కవిత అందుకున్నారు. ఈ డిమాండ్ పై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఏప్రిల్ 12న భారత జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటైన పూలే విగ్రహ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ దగ్గర భారీ ధర్నా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కవిత పూలే విగ్రహ ఏర్పాటుకు ఉద్యమాన్ని మొదలుపెట్టడంతో అధికార పార్టీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తుంది. పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తోంది.

Also Read: నేను మంత్రి అవుతా.. అప్పుడే వాళ్లు కంట్రోల్‌లో ఉంటరు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తాజాగా టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి పైన విమర్శలు గుప్పించారు కవిత. మహేందర్ రెడ్డి ని చైర్మన్ పదవి నుంచి తప్పించి ఆస్తులపై విచారణ జరిపించాలని కవిత డిమాండ్ చేసింది. ఇది కూడా అధికార పక్షానికి అస్త్రంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి అధికారికి ఉన్నత పదవిని ఎలా కట్టబెట్టారంటూ కాంగ్రెస్ నేతలు కవితను టార్గెట్ చేస్తున్నారు. మీ ప్రభుత్వ హయాంలో నీతిపరుడుగా ఉన్న మహేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా అవినీతిపరుడుగా మారారో చెప్పాలంటూ సవాళ్లు విసురుతున్నారు.

అసలే ఓటమి భారం.. ఆపై కవిత వ్యాఖ్యలు
పార్టీ ఎజెండాలో లేని అంశాలను కవిత తెరపైకి తెస్తుండడం అవి భూమరంగ్ అవుతూ brsనీ చిక్కుల్లో పడేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలే ఓటమి భారంలో ఉన్న brsకి కవిత వ్యవహారం రాజకీయంగా మరింత ఇబ్బందికర పరిస్థితులు తెస్తుందన్న చర్చ సాగుతోంది. సామాజిక ఉద్యమాలను కవిత కాకుండా సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో జరిపితేనే బాగుంటుందన్న అభిప్రాయాన్ని brs సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారని సమాచారం.