Maharashtra Politics: తాను కూడా రాజ్ థాకరేలాగే అన్న అజిత్ పవార్.. కొంపదీసి కొత్త పార్టీ పెడతారా ఏంటి?
శరద్ పవార్ గురించి అజిత్ పవార్ తాజాగా స్పందిస్తూ ఆయనంటే తనకు అమితమైన గౌరవమని, బాల్ థాకరే పట్ల రాజ్ థాకరే ఎంతటి విధేయత, గౌరవంతో ఉన్నారో తాను కూడా శరద్ పవార్ పట్ల అలాగే ఉంటానని అన్నారు. అయితే ఈ మాట తనకు తానుగా ఊరికే అనలేదు.

Sharad Pawar, Supriya sule and Ajit pawar
Maharashtra Politics: భారతీయ జనతా పార్టీతో చేతులు కలపబోతున్నారంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ మీద వార్తలు గుప్పుమంటున్నాయి. వీటికి బలం చేకూరుస్తున్నట్లే అజిత్ పవార్ మాటలు కనిపిస్తున్నాయి. తాను ముఖ్యమంత్రి అవ్వాలని, వచ్చే ఏడాది ఎన్నికలకు వరకు ఆగలేనంటూ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీని పొగిడారు. బీజేపీ మీద కూడా సానుకూలంగా స్పందించారు. బీజేపీతో చెలిమికి ఆయన నేరుగానే సందేశాలు పంపుతున్నట్లు విమర్శకులు అంటున్నారు.
ఎన్సీపీ నుంచి ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీతో అజిత్ పవార్ కలవనున్నట్లు వార్తల సారాంశం. రెండు వారాలుగా ఇది మహారాష్ట్రనే కాకుండా దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది. కాగా, రెండు రోజుల క్రితం అజిత్ పవార్ కదలికలపై శరద్ పవార్ హెచ్చరికలు చేశారు. పార్టీకి నష్టం జరిగే విధంగా ఎవరు వ్యవహరించినా తీవ్ర చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే అజిత్ పవార్ విషయంలో స్పష్టత లేనందున ఆ విషయంపై తాను మాట్లాడబోనని అన్నారు.
Karnataka Polls: ఉన్నట్టుండి మోదీని అంత మాటనేశారేంటి? వివాదాస్పదమైన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కామెంట్స్
ఇక ఇదే తరుణంలో శరద్ పవార్ గురించి అజిత్ పవార్ తాజాగా స్పందిస్తూ ఆయనంటే తనకు అమితమైన గౌరవమని, బాల్ థాకరే పట్ల రాజ్ థాకరే ఎంతటి విధేయత, గౌరవంతో ఉన్నారో తాను కూడా శరద్ పవార్ పట్ల అలాగే ఉంటానని అన్నారు. అయితే ఈ మాట తనకు తానుగా ఊరికే అనలేదు. ఉద్ధవ్ థాకరేకు కౌంటరుగా అజిత్ పవార్ ఇలా వ్యాఖ్యానించారు. ఒక సందర్భంలో ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ ‘‘అజిత్ పవార్ బయట ఎంతటి గౌరవం పొందుతున్నారో తన మామకు కూడా అంతటి గౌరవం ఇవ్వాలి’’ అని అన్నారు. దీనిపై అజిత్ పవార్ తనను తాను రాజ్ థాకరేతో పోలుస్తూ ఉద్ధవ్ థాకరేకు రిప్లై ఇచ్చారు.
శివసేనలో చాలా కాలం ఉన్న రాజ్ థాకరే ఒకానొక సమయంలో బయటికి వచ్చి మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అనే పార్టీని స్థాపించారు. అయితే అజిత్ పవార్ సైతం ఇలా చేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి తాజా వ్యాఖ్యలు ఉద్ధవ్ థాకరేకు కౌంటర్ ఇవ్వడం కోసమే అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మాత్రం అనేక అనుమానాల్ని కలిగిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే శివసేన చీలిపోయిన ఉదహారణ కూడా ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి మరి.