ఆ ఎంపీ చెప్పినట్టు జగన్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశమే లేదు, ఎందుకంటే

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. సాధ్యం కాని విషయాలను కూడా తనకు తోచిన విధంగా చెబుతున్నారు. తాజాగా ఏపీలోని జగన్ సర్కార్ కుప్పకూలుతుందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయ్యింది. ఏ విధంగా చూసినా అదంత సులభంగా జరిగేది కాదు. జగన్‌కు ఉన్నది బొటాబొటీ మెజారిటీ కూడా కాదు. బంపర్ మెజారిటీతో ఆయన అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రభుత్వ కుప్పకూలాలంటే ఎమ్మెల్యేలంతా జగన్‌పై తిరుగుబాటు చేయాలి. కానీ, అలాంటి పరిస్థితులు ఏ కోశానా కనిపించడం లేదు. జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం కూడా ఎవరూ చేయరు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు ఏ ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అంటూ చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితులు తలెత్తుతాయని సంచలన వ్యాఖ్యలు:
ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొంత కాలం వరకూ ఎంపీ రఘురామకృష్ణంరాజు బాగానే ఉన్నారు. వైసీపీపై ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. కానీ, రాను రాను ఆయన పార్టీతో వైరం పెంచుకొనేలా కనిపిస్తోంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూపై తనదైన శైలిలో స్పందించడం సంచలనం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్‌తో జగన్ సర్కారకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారాయన. ఇలాంటి వ్యవహారాలంతో ఏకంగా ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితులు తలెత్తుతాయని బాంబు పేల్చారు. పనిలో పనిగా వీలు దొరికిందని తన ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని విమర్శించారు రఘురామకృష్ణం రాజు.
న్యాయవ్యవస్థకు, ప్రభుత్వం మధ్య సంబంధాలను దెబ్బ తీసేందుకు కుట్ర:
న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ నిజమైతే.. వెంటనే విచారణకు ఆదేశించాలని ఏపీ ప్రభుత్వాన్ని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో న్యాయవాదులు, న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతోంది. న్యాయవ్యవస్థకు, ప్రభుత్వం మధ్య సంబంధాలను దెబ్బ తీసేందుకు కుట్ర జరుగుతోందని ఏపీ సర్కారు భావిస్తోంది. వ్యూహాత్మకంగా కొంత మంది వ్యక్తులు, శక్తులు కలిసి న్యాయవస్థను పక్కదారి పట్టించే కుట్ర చేస్తున్నారని అంటోంది. ఇదే సమయంలో ఎంపీ వ్యాఖ్యలు మరింత వేడి రాజేసింది.
అసలు ఆ ఎంపీకి ఏమైంది? సొంత పార్టీపైనే ఎందుకలా విరుచుకుపడుతున్నారు?
ఇటీవల కాలంలో పదే పదే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు రఘురామ కృష్ణంరాజు. ప్రస్తుతమున్న సర్కారుకున్న బలం నేపథ్యంలో కూలిపోయే అవకాశమే లేదు. కానీ, న్యాయవ్యవస్థ విషయాన్ని లింక్ చేస్తూ ఎంపీ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అసలు ఈ స్థాయిలో రఘురామకృష్ణం రాజు వైసీపీ సర్కారుపై ఎందుకు వైరం పెంచుకున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అవ్వాలని ఆయన కోరుకుంటున్నట్టుగా ఉందని అంటున్నారు. కానీ, జగన్ మాత్రం ఆ దిశగా ఇప్పటి వరకూ ఎలాంటి ఆలోచన చేయడం లేదంటున్నారు. ఆయనకున్న పదవులు ఊడగొట్టే దిశగానే వైసీపీ పెద్దల చర్యలుంటున్నాయని చెబుతున్నారు. తాజా వ్యాఖ్యలను వైసీపీ సర్కారు సీరియస్‌గా తీసుకుంటుందో లేదో చూడాలంటున్నారు.