జీర్ణించుకోవటం కష్టమే : సీఎం జగన్ కు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకం

జనసేన పార్టీకి షాక్ తగలబోతున్నది.. ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇబ్బందిగా మారిందా అంటే అవుననే అంటున్నారు సంఘటనలు. జనసేన అధినేత పవన్ ఓవైపు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంటే.. ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం పాజిటివ్ గా స్పందించారు. జగన్ చిత్రపటానికి ఏకంగా పాలాభిషేకం చేయటం విశేషం.
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటోవాలాలకు ఏడాదికి 10వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తోంది సర్కార్. అందుకు కృతజ్ణతగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నల్లవంతెన సెంటర్ లో సెంట్రల్ డెల్టా ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం నిర్వహించారు. ఆటో స్టాండ్ లో సీఎం జగన్ ఫొటోకు పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. దీనికి రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున గెలిచిన రాపాక వరప్రసాద్ హాజరయ్యారు. జగన్ బొమ్మకు పాలుపోసి ధన్యవాదాలు చెప్పారు.
ఆటో కార్మికుల సంక్షేమానికి సీఎం జగన్ చేస్తున్న కృషిని కొనియాడారు జనసేన ఎమ్మెల్యే రాపాక. ఇచ్చిన మాటకు కట్టుబడి.. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఆటో డ్రైవర్లకు న్యాయం చేయటం అద్భుతంగా అభివర్ణించారు. ప్రజల సంక్షేమానికి సీఎం జగన్ ఎంతో చేస్తున్నారని కొనియాడారు ఆయన.
సీఎం జగన్ నిర్ణయాలను తప్పుబడుతూ జనసేన చీఫ్ పవన్ ట్విట్లతో విరుచుకుపడుతుంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యే మాత్రం అందుకు భిన్నంగా పాలాభిషేకం చేయటం ఆ పార్టీలోనే చర్చనీయాంశం అయ్యింది.