ఎన్నికల వేళ : పార్టీలకు జంప్‌ జిలానీల టెన్షన్‌

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హాట్‌ హాట్‌గా మారుతున్నాయి.

  • Published By: veegamteam ,Published On : February 15, 2019 / 01:27 PM IST
ఎన్నికల వేళ : పార్టీలకు జంప్‌ జిలానీల టెన్షన్‌

Updated On : February 15, 2019 / 1:27 PM IST

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హాట్‌ హాట్‌గా మారుతున్నాయి.

అమరావతి : ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హాట్‌ హాట్‌గా మారుతున్నాయి. టిక్కెట్‌ దొరకనివాళ్లు, అసంతృప్త నేతలు పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ ఓ పార్టీ కండువాతో కనిపిస్తే .. సాయంత్రానికే మరో పార్టీ జెండా చేతపట్టుకుంటున్నారు. దీంతో ఎప్పుడు ఏ క్షణాన.. ఏ నేత ఏ పార్టీ గోడ దూకబోతున్నాడోననే సమాచారం .. అన్ని పార్టీల్లో కలకలం రేపుతోంది. 

ఎన్నికల వేళ జంప్‌ జిలానీలతో అన్ని పార్టీల్లో కలకలం రేగుతోంది. ఇప్పటికే టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జున రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్‌, ఎంపీ అవంతి శ్రీనివాస్‌లు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. తాజాగా మరికొంత మంది టీడీపీని వీడే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన కూడా ఫ్యాను పార్టీకే జై కొడతారన్నట్లు ఒంగోల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే విషయమై అనుచరులతో భేటీ అయ్యి గెలుపొటములపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే జగన్‌ను కలిసినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ఒంగోలు పార్లమెంట్ స్థానాల్లో తాను సూచించిన అభ్యర్థులను టీడీపీ అధిష్టానం మార్చకపోవడంతో మాగంటి మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. పైగా సొంత సర్వేలో ఓడిపోతానని తెలియడంతో .. పార్టీ మారితే సీను మారొచ్చని భావిస్తున్నారట. ఈనెల 17న వైసీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లు.. మాగుంట అనుచరులు చెబుతున్నారు. అటు దీనిపై బాలినేనికి అధిస్టానం సమాచారం అందించినట్లు కూడా తెలుస్తోంది.

నెల్లూరు టీడీపీలోనూ అసంతృప్తి గళం వినిపిస్తోంది. పెళ్ళకూరు శ్రీనివాసుల రెడ్డి అధిష్టానంపై స్వరం పెంచారు. కోవూరు టికెట్టు ఆశిస్తున్న తనను.. 2 సార్లు చర్చల కోసం పిలిచి అవకాశం లేదన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కోవూరు నుంచి పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. నేటి నుంచే నియోజకవర్గంలోకి వెళ్తున్నానని.. అధిష్టానం మాట నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంటే బహిరంగంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

అటు.. విజయవాడకు చెందిన తెలుగుదేశం నాయకుడు దాసరి జై రమేష్‌ కూడా టీడీపీని వీడారు. వైసీపీ అధినేత జగన్‌ను లోటస్‌పాండ్‌లోని ఆయన నివాసంలో కలిశారు. కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్న రమేష్‌.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 

జంప్‌ జిలానీలతో వైసీపీకి కూడా టెన్షన్‌ పట్టుకుంది. అధికార పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు ఫ్యాను విలవిలలాడుతోంది. నెల్లూరు జిల్లా నేతలు కాటం రెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి వైసీపీ షాక్‌ ఇచ్చారు. ఇద్దరూ పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వీరితోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఇతర నేతలు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. కావలి అభ్యర్థిత్వాన్ని ప్రతాప్ రెడ్డికి ఖరారు చేసినట్టు వస్తున్న వార్తలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వైసీపీకి రాజీనామా చేశారు. ఎన్నికల వేళ జంప్‌ జిలానీల విషయంలో అన్ని పార్టీలు..తమ నేతలు జారిపోకుండా చూసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా టిక్కెట్‌ దక్కని వారంతా పక్కచూపులు చూస్తూనే ఉన్నారు. 
 

Also Read : ఆపరేషన్ ఆకర్శ్‌ : వైసీపీలోకి వలసల జోరు?

Also Read : ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా : ఎమ్మెల్యేగా పోటీ