నాయకులు ఫుల్, కార్యకర్తలు నిల్.. ఏపీలో బీజేపీ బలపడేదేలా?

ఆ పార్టీలో సీనియర్ నాయకులకు ఏమాత్రం కొదవ లేదు. కేంద్రంలో చక్రం తిప్పగలిగే స్థాయి ఉన్న నాయకులే. రచ్చ గెలిచిన ఆ నాయకులు ఇంట గెలవలేకపోతున్నారు. పెద్ద లీడర్లు అనే నేమ్ బోర్డు ఉన్నా, వెనుక నడిచేందుకు పట్టుమని పది మంది కార్యకర్తలు లేరు. ఢిల్లీలో లాబీయింగ్ ఫుల్, గల్లీలో ఆదరణ మాత్రం నిల్. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ప్ర్రోగ్రామ్ చేసినా పార్టీకి మాత్రం బలం పెరగడం లేదు.
నాయకులు సరే కార్యకర్తలు ఏరి?
ఆంధ్రప్రదేశ్‌లో బలాన్ని పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఆ పార్టీలోకి చాలా మంది నేతలను చేర్చుకుంది. కాకపోతే నేతలు పుష్కలంగా ఉన్నా గ్రౌండ్ లెవెల్ లో కార్యకర్తలు మాత్రం పార్టీలో లేరనేది వాస్తవం. బీజేపీకి ఏపీలో నాయకత్వ లోపం ఏమీ లేదు. చెప్పుకోదగ్గ స్థాయిలో సీనియర్ నాయకులతో పాటు పక్క పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులతో పార్టీ బయటకు పటిష్టంగానే కనిపిస్తోంది. కానీ, ఏదైనా కార్యక్రమం చేయాలంటే పెద్ద పెద్ద నాయకులు వచ్చి దీక్షలలో, నిరసనలలో కూర్చుంటున్నారు తప్ప కార్యకర్తలు మాత్రం పెద్దగా కనిపించడం లేదని అనుకుంటున్నారు.
కనిపించింది కన్నా లేదా రావెల లేదా సుజనా చౌదరి:
అమరావతి ఉద్యమంలో కూడా రైతులకు సంఘీభావం తెలిపిన ప్రతిసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ లేదా రావెల కిశోర్ బాబు, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి ఇలా ఒంటరిగా వెళ్లి వారికి మద్దతు తెలపడమే కనిపించింది. అంతే తప్ప వారి వెనుక కార్యకర్తల సందడి మాత్రం లేదు. ఇక, కరోనా సమయంలో బీజేపీని పలకరించేందుకు ఆ కొద్దిపాటి కార్యకర్తలు కూడా లేరని చెప్పాలి. కరోనా వైరస్ వచ్చిన తర్వాత బీజేపీ వరస నిరసన దీక్షలతో మోతెక్కించింది.
కరోనా కారణంగా కార్యకర్తలు రావడం లేదట:
తిరుమల భూములు అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఒక రోజు చేపట్టిన ఉపవాస దీక్ష, కరెంట్ బిల్లులు తగ్గించాలంటూ నిరసనలు, మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూముల అమ్మకం, ఇసుక రీచ్‌ల వద్ద చేపట్టిన దీక్షలు ఇలా చాలా కార్యక్రమాలు చేపట్టింది. కానీ ఏ నిరసన చేసినా బీజేపీలోని జిల్లా స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు తప్ప కార్యకర్తలు మాత్రం కనిపించ లేదు. ఇప్పుడు ఆ పార్టీ నేతలకు ఇదే గుబులు పట్టుకుంటుందంట. కార్యకర్తలుంటేనే కింది స్థాయి వరకూ పార్టీని తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని, ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించే వీలుంటుంది. కరోనా కారణంగా కార్యకర్తలు రావడం లేదని బయటకు చెబుతున్నా.. కార్యకర్తలు ఉన్నా అదే జనం.. లేకపోయినా అదే జనమని లోలోపల ఫీలవుతున్నారట.
వర్చువల్ ర్యాలీల్లో స్పష్టంగా కనిపించిన లోటు:
ముఖ్యంగా వలస వచ్చిన వారితో పాటే కేడర్ మాత్రం రాలేదు. వారితో టచ్‌లో ఉన్న వారిని కూడా అడ్డుకుంటున్నారన్న విమర్శలున్నాయి. తాజాగా నిర్వహించిన బీజేపీ వర్చువల్ ర్యాలీల్లో సైతం కార్యకర్తలు లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ ర్యాలీల్లో బీజేపీ కేంద్రం ఏం చేసిందో, ప్రధాని ఏం చేశారో జాతీయ నాయకులతో చెప్పించే ప్రయత్నం బాగానే ఉన్నా ఏపీకి చేసిన సేవలు మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లటంలో విఫలమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ లోపాలు, బీజేపీ అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యకర్తల సంఖ్య లేకపోవడంతో వెనుకబడిపోయే పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా రూపుదిద్దుకోవడం కష్టమే:
ప్రతిసారి సీఎంకి లేఖలు రాయటం, నిరసన దీక్షలు చేయడం తప్ప.. రాష్ట్ర నాయకులు ఎవరూ కార్యకర్తల సమీకరణపై అసలు దృష్టి సారించకపోవడంపై అధినాయకత్వం సీరియస్‌గా ఉందని అంటున్నారు. నాయకత్వం అండతో బలంగా కనిపిస్తున్న బీజేపీ… కార్యకర్తల లోటును మాత్రం పూడ్చుకోకపోతే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా రూపుదిద్దుకోవడం కష్టమేనని ఉన్న కొద్ది పాటి ద్వితీయ శ్రేణి నాయకులు అనుకుంటున్నారు. ఈ దిశగా సీనియర్లుగా చలామణి అవుతున్న నేతలు దృష్టి సారించాలని సలహాలు ఇస్తున్నారు.