సీటు త్యాగం చేస్తారా? ప్రత్యర్థిగా మారి పోటీకి దిగుతారా? పెద్దపల్లి ఎంపీ సీటుపై బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ
వెంకటేశ్.. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు.. చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో బీఆర్‌ఎస్‌లో చేరిన వెంకటేశ్.. ఎంపీగా గెలుపొందారు.

Peddapalli BRS MP Ticket
Peddapalli BRS MP Ticket : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంపీ సీటు మార్పు కారు పార్టీలో ముసలం రేపనుందా? మాజీమంత్రికి టికెట్ ఇస్తే.. సిట్టింగ్ ఎంపీ పార్టీ మారుతారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో గులాబీ పార్టీలో సీటు సర్దుబాటు సాధ్యమవుతుందా? గత ఎన్నికల్లో ఎంపీగా గెలిపించిన గురువు కోసం.. ఇప్పుడు శిష్యుడు టికెట్ త్యాగం చేస్తారా ? లేక ప్రత్యర్థిగా మారుతారా ? అన్నది హాట్‌టాపిక్‌గా మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ చేసింది బీఆర్‌ఎస్ అధిష్టానం. మెజార్టీ లోక్‌సభ స్థానాలు గెలుచుకోవాలన్న టార్గెట్‌తో.. బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని భావిస్తున్నారు కేసీఆర్. ఇందులో భాగంగా పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతని మారుస్తారన్న చర్చ పార్టీలో మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీలో నిలవబోతున్నారన్నది బీఆర్‌ఎస్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
Also Read : ఆ ఒకే ఒక్కడు ఎవరు? బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వెళ్లేది అతడేనా?
వెంకటేశ్ నేత పెద్దపల్లి ఎంపీగా గత ఐదేళ్లుగా ఉన్నా.. ఇంకా ఆ ప్రాంతంలో కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. తనకంటూ ఓ ఇమేజ్‌ని, క్యాడర్‌ను తయారు చేసుకోకపోవడం ఆయనకు మైనస్ పాయింట్‌గా మారింది. అందుకే ఈసారి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ను పార్లమెంట్‌కు పోటీ చేయించాలని.. కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కోల్‌బెల్ట్ ప్రాంతంలో ఈశ్వర్ సుపరిచితుడు కావడం, గతంలో ఆయన సింగిరేణి కార్మికుడిగా పనిచేయడం కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు. దీనికితోడు మేడారం, ధర్మపురిలో ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటం కొప్పులకు ప్లస్ పాయింట్స్‌గా మారుతాయని అంచనా వేస్తున్నారు. దీనికితోడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బలమైన అభ్యర్థులు లేకపోవడం బీఆర్‌ఎస్‌కు బలంగా మారుతుందని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే.. సిట్టింగ్ సీటు మార్చితే వెంకటేశ్ నేత సర్దుకుపోతారా ? లేక మరో పార్టీలోకి జంప్ అవుతారా ? అన్న ప్రశ్న తలెత్తుతోంది. వెంకటేశ్.. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు.. చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో బీఆర్‌ఎస్‌లో చేరిన వెంకటేశ్.. ఎంపీగా గెలుపొందారు. గత ఎన్నికల్లో పార్టీ ఛరిష్మాతో విజయం సాధించిన వెంకటేశ్.. ఓన్ ఇమేజ్‌ను మాత్రం క్రియేట్ చేసుకోలేకపోయారు. అయినా.. పెద్దపల్లి నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గం ఓట్లు మాత్రం వెంకటేశ్‌కు ప్లస్ అనే చెప్పుకోవాలి.
Also Read : తెలంగాణలో బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేల భేటీపై గులాబీ వర్గాల్లో గుబులు..!
ఒకవేళ పెద్దపల్లి సిట్టింగ్ సీటు దక్కని పక్షంలో వెంకటేశ్ నేత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముందన్న టాక్ కూడా నడుస్తోంది. తొలిసారి హస్తం పార్టీ నుంచి పోటీ చేసిన క్రమంలో.. మరోసారి ఇక్కడి నుంచి ఆయనకు కాంగ్రెస్ అవకాశం ఇవ్వొచ్చన్న చర్చ నడుస్తోంది. మొత్తంగా గురువు కొప్పుల ఈశ్వర్ కోసం.. ఆయన సీటు త్యాగం చేసి మద్దతుగా నిలుస్తారా ? లేక.. ప్రత్యర్థిగా మారి పోటీకి దిగుతారా ? అన్నది వేచి చూడాల్సిందే.