జల యజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చారు : జగన్‌కు దోచి పెట్టారు

  • Published By: veegamteam ,Published On : May 5, 2019 / 09:40 AM IST
జల యజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చారు : జగన్‌కు దోచి పెట్టారు

Updated On : May 5, 2019 / 9:40 AM IST

ఏపీ మంత్రి దేవినేని ఉమ.. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. మోడీ, కేసీఆర్ వల్లే ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసే ఉన్నారని చెప్పారు. మోడీ ఎప్పుడైనా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారా అని దేవినేని ఉమ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్ ని పరిశీలించకుండానే.. పనులు జరగడం లేదని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చెయ్యడానికి వెంటనే నిధులు విడుదల చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుపైనా దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. బీజేపీ, వైసీపీకి కేవీపీ కోర్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జాతీయ ప్రాజెక్టుల పనితీరుపై కేసీఆర్, మోడీకి కేవీపీ లేఖలు రాయాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్మాణ రికార్డులు చూసి కేవీపీ సిగ్గుపడాలన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి డబ్బులు దండుకున్న కేవీపీ.. పోలవరంపై ఉత్తరాలు రాయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిధులను జగన్ కు దోచి పెట్టింది కేవీపీయేనని ఆరోపించారు. పోలవరానికి ఖర్చు పెట్టిన నిధులు రాకుండా ప్రధాని కార్యాలయం అడ్డుపడుతున్నా నోరెందుకు మెదపరని ప్రశ్నించారు. కేవీపీ ఓ గుంట నక్క అని మంత్రి దేవినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలవరానికి అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు.

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేవీపీ.. ఏపీ సీఎం చంద్రబాబుకి బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వైఖరితోనే పోలవరం విషయంలో ఏపీకి తీరని నష్టం జరిగిందని ఆయన లేఖలో ఆరోపించారు. వ్యక్తిగత స్వార్ధం, రాజకీయ ప్రయోజనాల కోసం… బీజేపీతో లాలూచీపడి ప్రజలకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని కేవీపీ మండిపడ్డారు. విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా సాధించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ కేవీపీ రాసిన బహిరంగ లేఖకు టీడీపీ నేతలు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు.