నేను బెదిరించలేదు, తప్పు చేయలేదు : అరెస్ట్ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే
మహిళా ఎంపీడీవోని బెదిరించిన కేసులో వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు.

మహిళా ఎంపీడీవోని బెదిరించిన కేసులో వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు.
మహిళా ఎంపీడీవోని బెదిరించిన కేసులో వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. కోటంరెడ్డి ఇంటి దగ్గర ఆయన అనుచరులు భారీగా చేరుకుంటుండంతో ఆక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. వెంకటాచలం ఎంపీడీవో సరళపై దౌర్జన్యానికి దిగిన కేసులో పోలీసులు ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని కోటంరెడ్డిపై ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పందించారు. ఎంపీడీవో సరళ ఇంటిపై తాను దౌర్జన్యం చేసినట్లు వచ్చిన వార్తల్ని కోటంరెడ్డి ఖండించారు. తాను ఎవరినీ బెదిరించలేదు అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. లేఔట్‌కు వాటర్ కనెక్షన్ గురించి మాత్రమే ఎంపీడీవోను ప్రశ్నించానని… ఆమెను దుర్భాషలాడలేదని చెప్పారు. అసలు ఆమె ఇంటికే వెళ్లలేదని తెలిపారు. కేవలం ఫోన్ చేసి అడిగాను అన్నారు. వ్యక్తిగత విషయాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. పోలీసుల విచారణలో వాస్తవాలు బయటపడతాయన్నారు.
సరళ ఇంటిపై దౌర్జన్యం చేశానన్నది అవాస్తవం అన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి.. దీనిపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాలన్నారు. తప్పు చేశానని తేలితే తనను వైసీపీ నుంచి బహిష్కరించాలన్నారు. ఈ కేసు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని కోటంరెడ్డి ఆరోపించారు.
తన ఇంటిపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారని వెంకటాపురం ఎంపీడీవో సరళ ఆరోపించారు. గొలగమూడి దగ్గర ఉన్న ఓ లేఔట్‌కు నీటి కనెక్షన్ మంజూరు చేయలేదన్న కోపంతో… ఎమ్మెల్యే తనను దుర్భాషలాడారని వాపోయారు. తన ఇంటి విద్యుత్, కేబుల్ కనెక్షన్లను తొలగించారని…. నీటి పైపులను తీసివేసేందుకు గుంతలను తవ్వించారని సరళ ఆరోపించారు. కోటంరెడ్డి దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఎంపీడీవో సరళ… అక్కడ కూడా తనకు న్యాయం జరగలేదని ఆరోపించారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. పట్టించుకున్న వారు లేరని వాపోయారు. నిరసనగా స్టేషన్ ముందే బైఠాయించారు. ఆమెకు గ్రామ కార్యదర్శులు సంఘీభావం తెలిపారు. చివరకు ఎంపీడీవో సరళ ఫిర్యాదుతో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోటంరెడ్డితో పాటు అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపైనా కేసు నమోదు చేశారు.
నెల్లూరు జిల్లాలో మహిళా అధికారిపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి దౌర్జన్యం చేయడం రాజకీయ రంగు పులుముకుంది. కోటంరెడ్డి ప్రవర్తనపై ప్రతిపక్ష నేతలు విరుచుకుపడ్డారు. నిజాయితీగా ఉన్న మహిళా అధికారిపై వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబు ధ్వజమెత్తారు. న్యాయం కోసం మహిళా అధికారి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే పోలీసులు కేసు తీసుకోవడానికే జంకారంటే పోలీసింగ్ ఉన్నట్టా? లేనట్టా? అని తీవ్రంగా మండిపడ్డారు.
ఈ ఘటనపై ఆరా తీశారు సీఎం జగన్. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన తర్వాత డీజీపీని అడిగి వివరాలు తెలుసుకున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని డీజీపీకి స్పష్టం చేసిన సీఎం.. ఆధారాలుంటే చట్ట ప్రకారం ఏ చర్యకైనా వెనుకాడొద్దని ఆదేశించారు.
Also Read : డెడ్ లైన్ బేఖాతర్ – విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులు – కొత్త నియామకాలకు సన్నాహాలు