తొమ్మిదా? ఆరా? ఉమ్మడి తూర్పుగోదావరిలో టీడీపీ, జనసేన మధ్య కొత్త చిక్కు
గోదావరి గడ్డపైనే పొత్తు ప్రకటన విడుదల కావడం.. ఇప్పుడు అదే గోదావరి జిల్లాల్లో సీట్ల సర్దుబాటుపై భిన్నప్రకనటలు చేయడం.. మరిన్ని స్థానాల్లోనూ పోటీ చేయాల్సిందేనంటూ జనసేనానిపై ఒత్తిడి పెరుగుతుండటం హీట్ పుట్టిస్తోంది. అసలు గోదావరి తీరంలో జనసేన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎక్కడెక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతోంది.

TDP Janasena Seats Sharing In East Godavari District
TDP Janasena Seats Sharing : సీట్లు సర్దుబాటుపై అధికారిక ప్రకటన రాకముందే రాజోలు, రాజానగరం సీట్లలో తాము పోటీచేస్తున్నట్లు జనసేనాని పవన్‌కల్యాణ్ చేసిన ప్రకటన.. గోదావరి తీరంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఇదే ప్రాంతంలోని మండపేటలో టీడీపీ అభ్యర్థిని ఆశీర్వదించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనికి కౌంటర్‌గా జనసేనాని ప్రకటన చేయడంతో.. పొత్తు పార్టీల మధ్య కొత్త చిక్కు వచ్చినట్లైంది.
గోదావరి గడ్డపైనే పొత్తు ప్రకటన విడుదల కావడం.. ఇప్పుడు అదే గోదావరి జిల్లాల్లో సీట్ల సర్దుబాటుపై భిన్నప్రకనటలు చేయడం.. మరిన్ని స్థానాల్లోనూ పోటీ చేయాల్సిందేనంటూ జనసేనానిపై ఒత్తిడి పెరుగుతుండటం హీట్ పుట్టిస్తోంది. అసలు గోదావరి తీరంలో జనసేన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎక్కడెక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతోంది.
పవన్‌పై జనసేన క్యాడర్ ఒత్తిడి..
టీడీపీ-జనసేన కూటమిలో పవన్ కల్యాణ్ ఇచ్చిన ట్విస్టుతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ‘రా కదలిరా సభ’లో మండపేటలో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని చంద్రబాబు చేసిన ప్రకటనతో జనసేనానిపై ఒత్తిడి పెరిగింది. పొత్తు ధర్మం విస్మరించి చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటన చేయడంపై జనసేనలో అసంతృప్తి పెల్లుబుకింది. ఇది పసిగట్టిన జనసేనాని పవన్.. పొత్తుల్లో చిన్నచిన్న భేదాభిప్రాయాలు రావడం సహజమేనని చెబుతూ.. తనపై ఒత్తిడి తగ్గించుకోడానికి రెండు నియోజకవర్గాల్లో తాము పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
Also Read : నిన్న పవన్ కల్యాణ్.. నేడు నాగబాబు.. టీడీపీ, జనసేన మధ్య అసలేం జరుగుతోంది?
ఇదే సమయంలో పవన్ ప్రకటనను టీడీపీ స్వాగతించింది. అంటే సీట్ల సర్దుబాటులో ఈ రెండు సీట్లు జనసేనకు వదిలేసేందుకు టీడీపీకి ఎలాంటి అభ్యంతరం లేదన్న విషయం స్పష్టమైంది. అయితే జనసేన బలంగా ఉన్న గోదావరి జిల్లాల్లో మరిన్ని చోట్ల పోటీ చేస్తామని ప్రకటించాలని పవన్‌పై ఆ పార్టీ క్యాడర్ ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి తూర్పుగోదావరిలో జనసేన సీట్లపై చర్చ
టీడీపీ-జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటుపై వివిధ దశల్లో చర్చలు జరుగుతున్నాయి. రెండు పార్టీల అధినేతలు పలు సందర్భాల్లో భేటీ అయి ఉమ్మడి మ్యానిఫెస్టోతోపాటు ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్నదానిపై చర్చించారు. ఐతే ఇంతవరకు సీట్ల సర్దుబాటుపై అధికారికంగా ప్రకటన విడుదలకాకపోవడం.. ఎన్నికలు సమీపిస్తున్నందున జనసేన సీట్లపై స్పష్టత కావాలంటూ ఆ పార్టీ క్యాడర్ నుంచి పవన్‌కల్యాణ్‌పై ఒత్తిడి పెరుగుతున్న పరిస్థితుల్లో రెండు సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించారు జనసేనాని. అయితే ఈ రెండు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే ఉండటంతో ఇంకా ఆ పార్టీ పోటీ చేసే స్థానాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
రెండేసి సీట్లు ఇచ్చేందుకు టీడీపీ రెడీ..!
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మూడేసి నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తోంది జనసేన. రాష్ట్రంలో జనసేన ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న జిల్లాగా తూర్పుగోదావరిని పరిగణిస్తున్నారు. టీడీపీ కూడా ఎక్కువ సీట్లను ఈ జిల్లా నుంచే ఇచ్చేందుకు సిద్ధంగా ఉందంటున్నారు. అలా అని జనసేన అడిగిన మూడేసి నియోజకవర్గాలు కాకుండా.. ఒక్కో పార్లమెంట్ పరిధిలో రెండేసి సీట్లు ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కల్లో టీడీపీ.. జనసేనకు ఆఫర్ చేస్తున్న నియోజకవర్గాలపై విస్తృత చర్చ జరుగుతోంది.
Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి కమలం పార్టీ! బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే?
ఆ సీటు కోసం జనసేన పట్టు..
కాపు ఓట్లు ఎక్కువగా ఉండే కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ నియోజకవర్గాలను జనసేన ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో కాకినాడ సిటీ నుంచి ముత్తా శశిధర్‌ను రంగంలోకి దింపనున్నారని ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో టీడీపీకి బలమైన అభ్యర్థి ఉండగా, జనసేన కూడా ఆ సీటును అడుగుతుండటంతో ఇరుపార్టీల్లో ఓ రకమైన టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
టీడీపీ నిర్ణయంపై ఉత్కంఠ..
ఇక కాపు ఉద్యమనేత ముద్రగడను పార్టీలో చేర్చుకుని ప్రత్తిపాడు నుంచి పోటీ చేయించాలని భావిస్తోంది జనసేన. మరోవైపు ఈ మూడు సీట్లలో ఏ రెండు ఇవ్వాలన్నదానిపై టీడీపీలో తర్జనభర్జన ఉన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్శను తప్పిస్తే క్షత్రియ సామాజిక వర్గానికి జిల్లాలో మరో సీటు కేటాయించాలి. ఆ సామాజికవర్గం నుంచి వర్మతోపాటు ముమ్మడివరంలో మాజీ ఎమ్మెల్యే బుచ్చిరాజుకు టికెట్ ఇవ్వాల్సి వుంటుంది. ఐతే ఈ సీటు కూడా జనసేన లిస్టులో ఉండటంతో టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ ఎక్కువవుతోంది.
రాజోలు టికెట్ రేసులో ఆ ముగ్గురు..
ఇదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ మూడు సీట్లు ఆశిస్తోంది జనసేన. ఇందులో రాజోలు నుంచి పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ సీటును ఆ పార్టీలో ముగ్గురు నేతలు ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి, ప్రస్తుతం జనసేన ఇన్‌చార్జిగా ఉన్న బొంతు రాజేశ్వరరావుతోపాటు, రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాల్సివుంది.
పిఠాపురం జనసేనకు ఇచ్చేది డౌటే..?
ఇక జనసేన ఆశిస్తున్న మరో నియోజకవర్గం ముమ్మడివరం. ఈ సీటుకు కాకినాడ జిల్లాలో కేటాయించే సీటుతో లింకు ఉండటంతో ముమ్మడివరం కాకుండా మరోసీటు జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఐతే ఆ సీటు ఏంటన్నది స్పష్టత రావడం లేదు. ఒకవేళ రాజోలుతోపాటు ముమ్మడివరం కూడా జనసేనకు కేటాయిస్తే పిఠాపురం జనసేనకు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు.
రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు కోసం జనసేన డిమాండ్
మరోవైపు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో రాజానగరంతోపాటు, కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాలను జనసేన ఆశిస్తోంది. రాజానగరం జనరల్ సీటుకాగా, నిడదవోలు, కొవ్వూరు ఎస్సీ రిజర్వు స్థానాలు. రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తానని ప్రకటించడం, దానికి టీడీపీ సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నందున ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణకు లైన్‌క్లియర్ అయినట్లే.
Also Read : వైఎస్ కుటుంబంలో రాజకీయ యుద్ధం.. షర్మిలతో జగన్‌కు చిక్కులు తప్పవా?
ఏఏ సీట్లు జనసేనకు?
మిగిలిన రెండు సీట్లలో ఏ సీటును పొత్తుల్లో ఫైనల్ చేస్తారో చూడాల్సి వుంది. ఇవి కాకుండా రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట సీట్లను జనసేన ఆశిస్తోంది. ఈ నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. కానీ, జనసేన అధిష్టానం మాత్రం ఉమ్మడి జిల్లా పరిధిలో 6 నుంచి 8 స్థానాల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో కొన్ని స్థానాల కోసమే ఎక్కువగా పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ ఎలా స్పందిస్తుంది? ఏఏ సీట్లను జనసేనకు విడిచి పెడుతుందనేదే గోదావరి తీరంలో ఉత్కంఠకు గురిచేస్తోంది.