దుబ్బాక ఉపఎన్నికలో నోట్ల కట్టల కలకలం.. అట్టుడికిన సిద్దిపేట!

political heat in siddipet, dubbaka by-election : దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో..సిద్దిపేటలో నోట్ల కట్టల వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతోంది. గత రాత్రి జరిగిన పరిణామాలు మరింత రాజకీయ వేడిని పుట్టించాయి. దాదాపు పది గంటల పాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది.
బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సహా ఆయన బంధువుల ఇళ్లలో పోలీసుల తనిఖీలు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్..అనంతరం సిద్దిపేట సీపీని సస్పెండ్ చేయాలంటూ ఆయన నిరసన దీక్షకు దిగడం..కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీయడం..ఇలా వరుస ఘటనలతో సిద్దిపేట అట్టుడికింది.
అయితే…బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఇంట్లో సోదాలు జరిపిన పోలీసుల వెర్షన్ ఓ విధంగా…బీజేపీ నేతల వెర్షన్ మరోలా ఉండటం..పొలిటికల్ హిట్‌ను రాజేస్తోంది. మూడు చోట్ల సోదాలు నిర్వహించామని… రఘునందన్ రావు బంధువు అంజన్‌రావు నివాసంలో 18.67 లక్షలు దొరికినట్టు పోలీసులు చెబుతున్నారు.
https://10tv.in/all-leaders-come-from-trs-in-dubbaka-bypolls/
అయితే ఆ డబ్బులు తమవి కావని…రఘునందనరావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డబ్బులు లాక్కున్న వారిపై చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతుంటే…దుబ్బాకలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో సిద్దిపేటలో సోదాలు చేసే హక్కు ఎవరిచ్చారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇక ఈ వ్యవహారంలో ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టింది రాష్ట్ర బీజేపీ. పోలీసులు వ్యవహరించిన తీరు పూర్తిగా అప్రజాస్వామికమని మండిపడ్డ బీజేపీ నేతలు…ఇవాళ గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధమయ్యారు. సిద్దిపేట, దుబ్బాకలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్ తమిళిసై కి వివరించనున్నారు. అటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కూడా కలిసి ఫిర్యాదు చేయన్నారు. అలాగే.. మంగళవారం అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలకు పిలునిచ్చింది బీజేపీ.
రఘునందన్ రావు మామ ఇంట్లో సోమవారం సాయంత్రం 18 లక్షల 65 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు. పోలీసుల చేతుల్లోని డబ్బును లాక్కొన్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
పోలీసుల నుంచి నగదు లాక్కెళ్లిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిద్ధిపేట సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. సిద్ధిపేట మున్సిపల్ ఛైర్మన్ రాంగోపాలరావుతో పాటు రఘునందన్‌రావు బంధువు అంజన్ రావు నివాసంలో సోదాలు నిర్వహించినట్టు చెప్పారు. అంజన్ రావు నివాసంలో 18.67 లక్షలు గుర్తించామన్నారు.
డ్రైవర్ ద్వారా మరో బంధువు జితేందర్‌రావు డబ్బులు పంపినట్లు అంజన్‌రావు వాంగ్మూలం ఇచ్చారని… డబ్బులు కొద్దికొద్దిగా పంపాలని జితేందర్‌రావు సూచించినట్లు అంజన్‌రావు తెలిపినట్టు చెప్పారు. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రఘునందనరావుతో సహా దాదాపు 250 మంది బీజేపీ కార్యకర్తలు వచ్చారని… 20 మంది ఇంట్లోకి చొరబడి.. పోలీసుల దగ్గర నుంచి నగదు లాక్కున్నారని సీపీ చెప్పారు.
మొత్తం 18.67 లక్షల్లో 5.87 లక్షల నగదు తీసుకెళ్లినట్టు సీపీ జోయల్ డేవిస్ వివరించారు. డబ్బులు తీసుకెళ్లిన వారి వివరాలు వీడియోల్లో రికార్డయ్యాయని.. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ….దుబ్బాక ఉప ఎన్నికలో తాను డబ్బు ఖర్చు పెట్టడం లేదని..నిజాయితీగా ప్రచారం చేస్తున్నానన్నారు బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు తమ బంధువులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
బీజేపీ సీరియస్
సిద్దిపేట ఘటనపై బీజేపీ సీరియస్ అయింది. సిద్దిపేట సీపీని సస్పెండ్ చేయాలంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్షకు దిగారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయం గేటుకు తాళం వేసుకుని దీక్ష కొనసాగిస్తున్నారు. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్‌ను సస్పెండ్ చేసే వరకు తన దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
అమిత్ షా ఫోన్
మరోవైపు బండి సంజయ్‌కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. సిద్ధిపేట ఘటనపై ఆరా తీశారు. సిద్దిపేటలో నెలకొన్న పరిస్థితులను అమిత్ షాకు వివరించారు బండి సంజయ్. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదన్నారు ఎంపీ అర్వింద్. ఓ ఐపీఎస్ ఆఫీసర్‌లాగా కాకుండా..ఓ గుండాలాగా పని చేస్తున్నాడంటూ…సీపీ జోయల్ డేవిస్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు అర్వింద్. ఎలక్షన్ కమిషన్ వెంటనే దుబ్బాక వ్యవహారాలపై దృష్టి పెట్టాలని…పూర్తిగా దుబ్బాకలో కేంద్ర బలగాలు దించాలని డిమాండ్ చేశారు.
పోలీసుల తీరు అప్రజాస్వామికం..కిషన్ రెడ్డి
ఇక పోలీసులు వ్యవహరించిన తీరు పూర్తిగా అప్రజాస్వామికమని అన్నారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి. ఏ రకమైన సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు ఇంట్లో వస్తువులను చిందర వందర చేశారని, మహిళలు, పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని, పోలీసులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో రఘునందన్‌రావును పరామర్శించిన కిషన్ రెడ్డి…ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, అధికారం శాశ్వతం కాదన్నారు.
బీజేపీ డబ్బులతో రాజకీయాలు చేయాలని చూస్తోంది..హరీష్ రావు
బీజేపీ డబ్బులతో రాజకీయాలు చేయాలని చూస్తోందని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పోలీసుల సోదాలో డబ్బులు దొరికితే సానుభూతి వస్తుందని బీజేపీ నేతలు నానా యాగీ చేస్తున్నారని విమర్శలు చేశారు. సోదాల సమయంలో తీసిన వీడియోలు ఉన్నాయని..ప్రజల ముందుకు ఆ వీడియోలను తీసుకువస్తామన్నారు. దుబ్బాకలో డిపాజిట్ దక్కదని బీజేపీకి అర్థమైందని.. అందుకే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్నారు మంత్రి హరీశ్‌రావు.