Chandira Priyanga: మంత్రి పదవికి రాజీనామా చేసిన పుదుచ్చేరి ఏకైక మహిళ ఎమ్మెల్యే.. అనంతరం సంచలన వ్యాఖ్యలు

తాను రాజీనామా చేసిన తర్వాత ఖాళీగా ఉన్న మంత్రి పదవికి వన్నియార్, దళిత లేదా మైనారిటీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను మాత్రమే నియమించాలని ముఖ్యమంత్రి రంగస్వామిని ఆమె అభ్యర్థించారు

Chandira Priyanga: మంత్రి పదవికి రాజీనామా చేసిన పుదుచ్చేరి ఏకైక మహిళ ఎమ్మెల్యే.. అనంతరం సంచలన వ్యాఖ్యలు

Updated On : October 11, 2023 / 8:34 PM IST

Puducherry Politics: పుదుచ్చేరిలోని ఏకైక మహిళా ఎమ్మెల్యే, కేబినెట్ మంత్రి ఎస్ చండీర ప్రియాంగ తన మంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కులతత్వం, లింగ వివక్ష, ధనబలం రాజకీయాలు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, మంత్రి ప్రియాంగ రాజీనామాపై వ్యాఖ్యానించడానికి ముఖ్యమంత్రి ఎన్ రంగసామి నిరాకరించారు. విలేకరులు అడిగిన ప్రశ్నలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. చండీర ప్రియంగ తన రాజీనామాను ముఖ్యమంత్రి కార్యాలయానికి సమర్పించారని, దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు ముఖ్యమంత్రి రంగసామి తెలిపారు.

ప్రజల మద్దతుతోనే తాను అసెంబ్లీకి చేరుకున్నానని, అయితే కుట్ర రాజకీయాలను అధిగమించడం అంత సులువు కాదని గ్రహించానని ప్రియాంగ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తాను కులతత్వం, లింగ వివక్షకు గురైనట్లు లేఖలో పేర్కొన్నారు. త్వరలో సవివరమైన నివేదికను అందజేస్తానని చండీర ప్రియంగ తెలిపారు. తాను రాజీనామా చేసిన తర్వాత ఖాళీగా ఉన్న మంత్రి పదవికి వన్నియార్, దళిత లేదా మైనారిటీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను మాత్రమే నియమించాలని ముఖ్యమంత్రి రంగస్వామిని ఆమె అభ్యర్థించారు. ధనబలం ఆధారంగా మంత్రి పదవికి సిద్ధపడే ఏ ఎమ్మెల్యేనైనా తన వారసులుగా చేయకూడదని, అది వన్నియార్ లేదా దళిత వర్గాలకు ‘అన్యాయం’ కలిగిస్తుందని కూడా ఆమె స్పష్టం చేశారు.

చండీర ప్రియాంగ ఎవరు?
2021లో నెడుంకాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చండీర ప్రియాంగ.. పుదుచ్చేరిలో మంత్రిగా పనిచేసిన ఏకైక మహిళ. రంగసామి ప్రభుత్వంలో ప్రియంగకు రవాణా శాఖ బాధ్యతలు అప్పగించారు.