వర్మ క్వశ్చన్ : జగన్‌ కేసులో ఒక న్యాయం నాకొక న్యాయమా

  • Published By: veegamteam ,Published On : April 29, 2019 / 09:49 AM IST
వర్మ క్వశ్చన్ : జగన్‌ కేసులో ఒక న్యాయం నాకొక న్యాయమా

Updated On : April 29, 2019 / 9:49 AM IST

హైదరాబాద్ : దర్శకుడు రాంగోపాల్ వర్మకు కోపం వచ్చింది. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మండిపడ్డాడు. ఏపీ పోలీసులు, ప్రభుత్వం తీరుని తప్పుపట్టాడు. పోలీసులు తనతో వ్యవహరించిన తీరు  సరిగా లేదన్నాడు. వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో ఒక న్యాయం, నాకొక న్యాయమా? అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. జగన్ కేసులో విశాఖ ఎయిర్ పోర్ట్ తమ పరిధిలో లేదని చెప్పిన  ఏపీ ప్రభుత్వం.. తనను ఎలా అడ్డుకుందో చెప్పాలన్నారు. ఏపీ పోలీసులు రోడ్డు మీద ఉన్న తనను లాక్కెళ్లి గన్నవరం ఎయిర్ పోర్టు లోపలికి తీసుకెళ్లారని, 7 గంటల పాటు నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎయిర్ పోర్టు వరకే మాకు అధికారం ఉంది, ఎయిర్ పోర్టు లోపలికి వెళ్లే అధికారం కానీ, అందులోని సెక్యూరిటీతో కానీ మాకు సంబంధం లేదని జగన్ పై దాడి కేసులో ప్రభుత్వం, చాలా మంది టీడీపీ నాయకులు చెప్పారని వర్మ గుర్తు చేశాడు. మరిప్పుడు ఎయిర్ పోర్టు లోపలికి ఏపీ పోలీసులు ఎలా వచ్చారో చెప్పాలని నిలదీశాడు. జగన్ పై దాడి జరిగినప్పుడు ఎయిర్ పోర్టులోకి రాలేని పోలీసులు తమ విషయంలో ఎయిర్ పోర్టులోకి ఎలా వచ్చారు అని లాజిక్ లాగాడు.

ఏపీలో ప్రెస్ మీట్ పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదా అని వర్మ ప్రశ్నించాడు. కారణం లేకుండా నిర్బంధించడం సరికాదన్నాడు. ఇది ఏపీనా, నార్త్ కొరియానా అర్థం కావడం లేదన్నాడు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, నియంతృత్వ రాజ్యంలో ఉన్నామా అని అడిగాడు. నిన్నటి షాక్ నుంచి తాను ఇంకా బయటకు రాలేకపోతున్నానని వ్యాఖ్యానించారు ఎన్టీ రామారావు జీవిత భాగస్వామి లక్ష్మీపార్వతి కోణంలో వర్మ తెరకెక్కించిన సినిమా “లక్ష్మీస్ ఎన్టీఆర్”. చంద్రబాబు వెన్నుపోటు కథాంశాన్ని తీసుకుని వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఏపీలో తప్ప దేశవ్యాప్తంగా, ఓవర్సీస్‌లోనూ విడుదలైంది. ఎన్నో విమర్శలు మరెన్నో వివాదాలు.. కోర్టులు, కేసులు అనంతరం ఈ సినిమా మే 1న ఏపీలో కూడా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్‌ చేసుకునేందుకు వర్మ ఆదివారం (ఏప్రిల్ 28,2019) ఏపీకి వెళ్లగా అక్కడ పోలీసులు వర్మను అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్‌కు పంపేశారు. సోమవారం (29 ఏప్రిల్ 2019) ఈ వివాదాలకు సంబంధించి హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో వర్మ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై ఫైర్ అయ్యాడు.

విజయవాడ నడిరోడ్డుపై ప్రెస్ మీట్ పెడుతున్నా అని వర్మ ప్రకటించి రంగంలోకి దిగిన తర్వాత 7 గంటల పాటు హైడ్రామా నడిచింది. ఆదివారం (ఏప్రిల్ 28,2019) మధ్యాహ్నం 12 గంటల నుంచి 7 గంటల పాటు గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గర ఈ హైడ్రామా నడిచింది. చివరకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వర్మను పోలీసులు విమానంలో హైదరాబాద్ తరలించారు. గన్నవరం విమానాశ్రయం వెలుపలికి వచ్చిన వెంటనే పోలీసులు వర్మను అడ్డుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకి రాకుండా చూశారు. చివరకి సాయంత్రం హైదరాబాద్ పంపేశారు. తనను గన్నవరం ఎయిర్ పోర్టులో నిర్బంధించారని వర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. విజయవాడకు తాను రాకూడదా, విజయవాడలో ఉండకూడదా అని వర్మ ప్రశ్నించాడు. విజయవాడలో తన సినిమా గురించి చెప్పుకునే హక్కు తనకు లేదా అని అడిగాడు.