రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ.. క్రెడిట్ కోసం టీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నాలు

  • Published By: naveen ,Published On : October 2, 2020 / 04:18 PM IST
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ.. క్రెడిట్ కోసం టీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నాలు

Updated On : October 2, 2020 / 4:26 PM IST

Ramagundam Fertilizers and Chemicals Limited: రామగుండం ఎరువుల కర్మగారం వేదికగా… టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయం ముదురుతుంది. తెచ్చింది మేమంటే… ఇచ్చింది మేమంటూ ఇరు పార్టీల జెండాలను కర్మాగారంపై ఎగరవేయడానికి నేతలంతా పోటీ పడుతున్నారు. ఇక బీజేపీకి వలస వెళ్లిన నేతలంతా ఇప్పుడు క్రెడిట్ అంతా మాదే అంటూ చెప్పుకోస్తుంటే… పార్టీ మారక ముందు అంతా టీఆర్ఎస్ ఘనత అని చెప్పారుగా అంటూ సెటైర్లు వేస్తున్నారు అధికార పార్టీ నేతలు. తాజా మాజీల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుతో రామగుండం రాజకీయాలు చర్చనీయాంశం అయ్యాయి.

మా వల్లే అని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు:
ఖాయిలా పడ్డ పరిశ్రమల జాబితా నుంచి బయటపడి… పునరుద్ధరణ జరుగుతున్న రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభానికి సిద్ధమవుతుండడంతో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఎవరికి వారు అదంతా తమ చలవేనని చెప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రయివేట్ సంస్థల భాగస్వామ్యంతో రామగుండం ఎరువుల కర్మాగారం నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది.

వాస్తవం ఏంటంటే.. ఈ కర్మగారం ఓపెన్ కావడానికి అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల పాటు.. మాజీ ఉద్యోగులు, స్థానికులు చేసిన కృషి ఉందని జనాలు అనుకుంటున్నారు ఇదంతా పక్కన పెట్టి ఇప్పుడు ఆ రెండు పార్టీలూ తమ ఖాతాలో క్రెడిట్ వేసుకోవడానికి ప్రయత్నిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

పారిశ్రామిక ప్రాంతంలో బలపడేందుకు బీజేపీ యత్నం:
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బీజేపీ బలోపేతానికి ప్రయత్నం చేస్తుండగా… దానికి చెక్‌ పెట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఎరువుల కర్మాగారంపై ఎవరు జెండాను ఎగుర వేస్తారో వారికి రాజకీయంగా కలిసి వస్తుంది. ప్రజల్లో మైలేజ్ వస్తుందనే ఉద్దేశంతోనే ఇరు పార్టీలూ పోటీ పడుతున్నాయని అంటున్నారు. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం… రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారంతోనే ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ జరిగిందని జనాలు అనుకుంటున్నారు.

ప్రచారాస్త్రంగా వాడుకోవడానికి వ్యూహం:
భవిష్యత్ ఎన్నికల ప్రచారంలో ఎరువుల కర్మాగారాన్ని ప్రచారాస్త్రంగా వాడుకోవడానికి ఇరు పార్టీలకు చెందిన నేతలంతా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నేతల భవిష్యత్‌ని ఎరువుల కర్మగారం డిసైడ్ చేసే అవకాశం ఉండడంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

కర్మగారంలో స్థానికులకు ఉపాధి కల్పించాలంటూ అధికార పార్టీకి చెందిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత ఆందోళన కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందంటూ మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ ఎంపీ వివేక్ విమర్శిస్తున్నారు.

బీజేపీకి నాన్ లోకల్ టెన్షన్:
సత్యనారాయణ, వివేక్ టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరాక రాజకీయంగా టీఆర్ఎస్‌కు కర్మాగారంలో పట్టు రాకుండా జాగ్రత్త పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక టీఆర్ఎస్ నేతలు బీజేపీ ఎత్తులకు పై ఎత్తులను వేస్తూ, నాన్ లోకల్ వారికి ఉద్యోగాలను ఇప్పించడంలో బీజేపీ హస్తముందని ఆరోపిస్తున్నారు. లోకల్ ఉద్యోగాల పేరిట టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తుండడంతో బీజేపీ నేతల్లో టెన్షన్ మొదలైందట. లోకల్ వారికి ప్రాధాన్యం ఇస్తామని బీజేపీ చెబుతున్నా.. ఇప్పటికే నాన్ లోకల్ వారితో భర్తీ జరిగిపోయిందని టీఆర్ఎస్‌ వాదిస్తోంది.

బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పాడే అవకాశం:
గతంలో పనిచేసిన ఉద్యోగులు సైతం ఆందోళనలకు సిద్ధమవుతుండడంతో బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పాడే అవకాశం ఉందంటున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు, కార్మిక కుటుంబాల ఓట్లు కీలకం. ఇక్కడ కార్మికుల మద్దతుపైనే నేతల రాజకీయ జీవితం ఆధారపడి ఉంటుంది. పార్టీల కంటే వ్యక్తులకే ఇక్కడ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి కొత్తగా ప్రారంభం కానున్న కర్మాగారంలో కార్మికుల ఓట్లతో పాటు వారి కుటుంబాల ఓట్ల కోసం కాంట్రవర్సీ పాలిటిక్స్ నడిపిస్తున్నారని అంటున్నారు. మరి ఎవరు పట్టు సాధిస్తారో చూడాల్సిందే.