ఏంటి సంగతి : రాహుల్ – గడ్కరీ గుసగుసలు, నవ్వులు

  • Published By: venkaiahnaidu ,Published On : January 26, 2019 / 12:34 PM IST
ఏంటి సంగతి : రాహుల్ – గడ్కరీ గుసగుసలు, నవ్వులు

ఢిల్లీ రాజ్ పథ్ లో శనివారం(జనవరి 26, 2019) రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల సమయంలో ఓ ఆశక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు ముందు వరుసలో  పక్కపక్కన కూర్చొని ఆత్మీయంగా మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాహుల్ కి కుడివైపున ముగ్గురి తర్వాత బీజేపీ చీఫ్ అమిత్ షా కూర్చొన్నారు. 

మరోవైపు కొన్నిరోజులుగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేస్తున్న గడ్కరీ..ఈ నెల ప్రారంభంలో  నెహ్రూ, ఇందిరలపై గడ్కరీ ప్రశంసల జట్టు కురిపించిన విషయం తెలిసిందే. నెహ్రూ ప్రసంగాలు తనకెంతో ఇష్టమని, మహిళా సాధికారితకు ఇందిరా గాంధీ నిదర్శనమని గడ్కరీ అన్నారు.  దీంతో రాబోయే రోజుల్లో రాఫెల్ డీల్ పై గడ్కరీ కూడా రాహుల్ ఆరోపణలతో ఏకీభవిస్తారేమోనని కాంగ్రెస్ నేత  ఆశిష్ దేశ్ ముఖ్ అన్నారు. ఈ సమయంలో రాహుల్, గడ్కరీలు పక్కపక్కన కూర్చొని ఆత్మీయంగా మాట్లాడుకోవడంపై పలువురు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

అయితే గతేడాది రాహుల్ కి కేటాయించిన సీటు పట్ల పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. గతేడాది రాహుల్ కి నాల్గవ వరుసలో కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ పక్కన సీటు కేటాయించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రాహుల్ గాంధీని నిర్లక్ష్యం చేశారని, అందుకే ముందువరుసలో కాకుండా నాల్గవ వరుసలో సీటు కేటాయించారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ ఎప్పుడూ ముందువరుసలో కూర్చొనేదని అన్నారు. అయితే చివరికి రాహుల్ ఈ వివాదానికి ముగింపు పలికారు. తాను ఎక్కడ కూర్చున్నాననేది ముఖ్యం కాదని, కార్యక్రమానికి హాజరయ్యామా లేదా అన్నదే ముఖ్యమని వివాదానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే.