కుల వివక్ష పెంచి పోషించింది చంద్రబాబే… తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి

అమరావతి : కుల వివక్ష అనేది రాజధానిలో కనిపించడం దారుణం అని… సామాజిక వర్గం పేరుతో నన్ను మానసికంగా కుంగతీశారని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. వినాయకుడ్ని ముట్టుకుంటే మైల పడుతుందని ఒక సామాజిక వర్గం నేతలు నన్ను దూషించారని శ్రీదేవి చెప్పారు.
రాజధానిలో జరుగుతున్న అవినీతిని వెలికితీసినందుకే నన్ను మానసిక వేధిస్తున్నారని ఆమె తెలిపారు. రాజధానిలో భూములు ఇచ్చిన దళితులకు ప్యాకేజీలో వివక్ష చూపించారని ఆమె వివరించారు. రాజధాని పరిధిలోని టీడీపీ నేతలు చెప్పరాని మాటలతో నన్ను దూసిస్తున్నారని ఆమె బాధ పడ్డారు. గతంలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దళితులు శుభ్రంగా ఉండరని మాట్లాడారు..ఇంతటి కుల వివక్షను దేశంలో ఎక్కడా చూడలేదు. టీడీపీ నాయకులకు కుల రాజకీయం తలకెక్కిందని, రాజధానిలో వైసీపీ గెలవడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని ఆమె అన్నారు.
రాజధానిలో వైసీపీని ఓడించాలని టీడీపీ నేతలు రిగ్గింగ్ కూడా పాల్పడ్డారని ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు. నాపై కుల వివక్షకు పాల్పడిన వారిని పెంచి పోషించింది చంద్రబాబే అని..చంద్రబాబును కూడా అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు… దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని మాట్లాడారని….యథా రాజా తధా ప్రజా అన్నట్లు చంద్రబాబు బాటలోనే టీడీపీ నాయకులు,కార్యకర్తలు నడుస్తున్నారని ఆమె ఆరోపించారు. దళితులు టీడీపీపై తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని…టీడీపీ నేతల దాడులను తట్టుకునే పరిస్థితిలో దళితులు లేరని ఆమె అన్నారు.