చల్లారని గొడవలు : నెల్లూరులో ఉద్రిక్తత వాతావరణం

ఎన్నికలు పూర్తైనా TDP, YCP కార్యకర్తల మధ్య గొడవలు చల్లారడం లేదు. టీడీపీ నాయకుల ఆగడాలు ఎక్కువయ్యాయని వైసీపీ నేతలు, వైసీపీ దారుణలు పెరిగిపోతున్నాయని టీడీపీ నేతలు .. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ధర్నాలతో .. నెల్లూరు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్ధితిని చక్కదిద్దేందుకు పోలీసులు శతావిధాలా ప్రయత్నిస్తున్నారు. TNSF లీడర్ తిరుమల నాయుడిపై YCP కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా.. టీడీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. స్థానిక VRC సెంటర్లో పెద్ద ఎత్తున వచ్చిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆందోళన చేశారు. ఎరుపు రంగు నీళ్లు రక్తంగా చూపిస్తూ వైసీపీ నాయకులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాస్క్‌లు ధరించి.. రక్తం తాగుతున్నట్లుగా నిరసన ప్రదర్శన చేశారు. పోలీసులు వారిని నివారించడానికి విఫలయత్నం చేశారు.
నెల్లూరులోని వైసీపీ రూరల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమలనాయుడు సతీమణి సాయి అన్విత.. వైసీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వైసీపీ నాయకుల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఆమె రోడ్డుపై బైఠాయించారు. తన భర్తపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను శిక్షించాలని డిమాండ్ చేశారు. సాయి అన్విత ఆందోళనతో వైసీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని.. ఆందోళనకారులను అక్కడ నుంచి పంపించారు.
అటు టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో టీడీపీ నాయకులు ఆగడాలు ఎక్కువయ్యాయని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడు తిరుమలనాయుడుపై జరిగిన దాడిని తాను చేయించానని టీడీపీ నాయకులు చెప్పడాన్ని.. శ్రీధర్‌రెడ్డి తప్పుపట్టారు. దాడితో తనకు సంబంధం లేదన్నారు. తిరుమల నాయుడుకి చాలా మందితో వ్యక్తిగత కక్షలున్నాయన్నారు. దాడిపై విచారణ చేపట్టకుండానే తనపై అభండాలు వేయడం సరికాదని, మేయర్ అబ్దుల్ అజీజ్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. తనపై వేసిన నిందకు బీదా రవిచంద్ర సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల పోలింగ్ ముగిసినా ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో పోలీసులు అదనపు భద్రతా ఏర్పాట్లపై దృష్టి పెట్టారు.