బీజేపీలోకి టీఆర్ఎస్ నేత, హైదరాబాద్ మాజీ మేయర్? ఆ కోరిక తీర్చుకునేందుకేనట

  • Published By: naveen ,Published On : November 19, 2020 / 12:28 PM IST
బీజేపీలోకి టీఆర్ఎస్ నేత, హైదరాబాద్ మాజీ మేయర్? ఆ కోరిక తీర్చుకునేందుకేనట

Updated On : November 19, 2020 / 12:34 PM IST

Teegala Krishna Reddy: పదవులే రాజకీయాల్లో ముఖ్యం. అధికారంలో ఉన్నా లేకపోయినా ఏదో ఒక పదవిలో ఉంటే ఆ కిక్కే వేరని భావిస్తారు నాయకులు. మరి అదే పదవి లేకపోతే పక్క పార్టీలవైపు లుక్కేస్తారు. ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా మంది నాయకులు అదే రూట్లో ఉన్నారట. రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు బీజేపీలో చేరతారనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. తాజాగా టీఆర్‌ఎస్‌ నాయకుడు, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా బీజేపీ చేరేందుకు రెడీ అయ్యారనే టాక్‌ మొదలైంది.

టీఆర్ఎస్ కు తీగల గుడ్ బై?
ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతితో భేటీ అయ్యారు. దీంతో ఆమె బీజేపీ గూటికి చేరతారనే పెద్ద ఎత్తున ఊహగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆమెను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. ఇక, తాజాగా టీఆర్‌ఎస్‌ నాయకుడు, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఆయన త్వరలోనే కాషాయ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీలో చేరి 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ పరిసరాల్లోని ఏదో ఒక లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.