అటు వెండి తెరపై ఇటు నియోజకవర్గంలో ఎక్కడా కన్పించడం లేదు, ఆయనకు ఏమైంది?

సినిమాల పరంగా తెలుగువారికి పరిచయం అవసరం లేని పేరు బాబూ మోహన్. రాజకీయాల్లోనూ రాణించి, మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఈ మధ్య జనం ఆయనను మరిచిపోయినట్లే ఉన్నారు. అటు వెండి తెరపై ఇటు ఆందోల్ నియోజకవర్గంలో ఎక్కడా కన్పించడం లేదు. తెరపై కనిపించి ఆబాలగోపాలన్ని అలరించిన నటుడిగా బాబూమోహన్‌కు ఇండస్ట్రీలో మంచిపేరే ఉంది. దశాబ్దాలుగా హాస్య నటునిగా జనాల్ని నవ్వించి తనదైన శైలిలో కామెడీ చేసి మెప్పించారు. నటునిగా ఒక వెలుగు వెలుగుతున్న దశలో తన దిశను రాజకీయాల వైపుకు మార్చుకున్నారాయన.
బాబూ మోహన్ పై జనంలో వ్యతిరేకత పెరగడానికి కారణమిదే:
తెలుగుదేశం పార్టీలో చేరి 1998లో మెదక్ జిల్లా ఆందోల్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేసి, గెలిచి ఏకంగా కార్మిక శాఖ మంత్రిగా చాన్స్ కొట్టేశారు. ఆ తర్వాత 2004లోనూ, 2009 లోనూ పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరి టికెట్ సంపాదించడమే కాదు… గెలిచారు కూడా. రెండుసార్లు వరుసగా ఓడించిన జనంపై బాబూమోహన్ కసి పెంచుకున్నారో ఏమో తెలియదు కానీ, తాను చెప్పిందే మాట, తన మాటకు ఎదురులేదు అన్నట్లుగా వ్యవహరించడం మొదలుపెట్టడంతో జనంలో వ్యతిరేకత పెరిగింది. అంతేకాదు అధికారులపై నోరు పారేసుకున్నారు.
బాబూ మోహన్ తీరుపై గుర్రుగా ఉన్న పార్టీ నేతలు:
ఆందోల్‌కు అతిథి ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. ఎప్పుడో ఒకసారి హైదరాబాద్ నుంచి వచ్చి జనాన్ని, అధికారుల్ని తిట్టి పోతుండేవారట. ఈ రకంగా జనానికి దూరం కావడం, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టకపోవడంతో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బాబూమోహన్‌ను పోటీకి దూరంగా ఉంచి, క్రాంతికిరణ్‌కు సీటు ఖరా రుచేసింది. అంతే బాబూమోహన్ బీజేపీలోకి జంప్ అయి, పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. ఓటమి తర్వాత నియోజకవర్గానికి రావడం పూర్తిగా తగ్గించేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రాని వాడు ఇప్పుడేం వస్తాడులే అంటూ ఆ పార్టీ కార్యకర్తలు పెద్దగా ఆలోచించడం లేదంటున్నారు. కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం బాబూమోహన్ వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు.
రాజకీయ భవిష్యత్ అంధకారం:
వెండితెరపై నవ్వులు పూయించి మంచి నటునిగా పేరుతెచ్చుకున్న బాబూమోహన్, రాజకీయాల్లో మాత్రం వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేయించుకుని ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడిగా మిగిలిపోయారని అంటున్నారు. నా ఫేస్ వ్యాల్యూ మీకేం తెలుసంటూ ఓటేసిన జనంపైనే ఒంటి కాలితో లేచినోడు.. నాతో పెట్టుకుంటే అంతే సంగతులంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చిన ఆయన రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలని జనాలు అనుకుంటున్నారు.