Chevella Congress MP Candidate : చేవెళ్లకు కొత్త చెల్లెమ్మ..! కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆమేనా?

బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానమైన చేవెళ్లలో కాంగ్రెస్‌ జెండా ఎగరేయాలన్నదే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. మరి టార్గెట్‌ 14లో కాంగ్రెస్‌ ప్లాన్‌ ఎంతవరకు వర్కౌట్‌ అవుతుందనేది చూడాలి.

Chevella Congress MP Candidate : చేవెళ్లకు కొత్త చెల్లెమ్మ..! కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆమేనా?

Chevella Congress MP Candidate

Updated On : February 29, 2024 / 6:09 PM IST

Chevella Congress MP Candidate : లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్‌ పంథా మారిందా? రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దూకుడుగా కనిపిస్తున్న హస్తం పార్టీ.. ప్రత్యర్థి పార్టీల కన్నా ముందే అభ్యర్థులను ప్రకటించాలని ప్లాన్‌ చేస్తోందా? కోస్గి బహిరంగ సభలో మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డిని ప్రకటించిన సీఎం.. తాజాగా చేవెళ్ల సభలో సునీతా మహేందర్ రెడ్డి.. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పడం వెనుక ఉద్దేశమేంటి?

కాంగ్రెస్ కొత్త పంథా..
పార్లమెంట్‌ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్‌ ఫోకస్‌ పెంచింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ స్థానాల్లో కనీసం 14 గెలవాలని టార్గెట్‌ పెట్టుకున్న చేయి పార్టీ.. అభ్యర్థుల ప్రకటనపై వడివడిగా అడుగులు వేస్తోంది. స్ర్కీనింగ్‌ కమిటీ, సెలక్షన్‌ కమిటీ వంటి సంప్రదాయ పద్ధతులు ఏవీ పట్టించుకోకుండానే ఒక్కొక్క నియోజకవర్గానికి అభ్యర్థులను ప్రకటిస్తూ కొత్త విధానానికి తెరతీస్తోంది తెలంగాణ కాంగ్రెస్‌.

హైకమాండ్‌ నుంచి పూర్తి స్వేచ్ఛ తీసుకున్న సీఎం రేవంత్..
ప్రజల సమక్షంలో పార్లమెంట్‌ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా తమ అభ్యర్థులకు ప్రజా మద్దతు ఉందనే సంకేతాలు ఇస్తోంది కాంగ్రెస్‌. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌ పరిధిలోని కోస్గీలో జరిగిన బహిరంగ సభలో మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా చల్లా వంశీచంద్‌రెడ్డిని ప్రకటించారు సీఎం రేవంత్‌రెడ్డి. సహజంగా ఢిల్లీ వేదికగా కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. కానీ, హైకమాండ్‌ నుంచి పూర్తి స్వేచ్ఛ తీసుకున్న ముఖ్యమంత్రి తనదైన స్టైల్‌లో అభ్యర్థులను నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.

చేవెళ్ల ఎంపీ అభ్యర్థిపై క్లారిటీ..
మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి పేరును నేరుగా ప్రకటించిన సీఎం.. చేవెళ్ల జన జాతర సభలో చేవెళ్ల ఎంపీ అభ్యర్థిని పరోక్షంగా తెలియజేశారు. వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పడం ద్వారా ఆమె వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేస్తారని స్పష్టత ఇచ్చినట్లైంది. అంతేకాకుండా సీఎం మాట్లాడుతున్నంతసేపు సునీతా మహేందర్‌రెడ్డి ఆయన పక్కనే నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించారు.

అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు..
తెలంగాణ‌లో అత్యధిక స్థానాలు గెలవకపోతే ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున.. అభ్యర్థుల ఎంపికపై పకడ్బందీగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని అభ్యర్థులను నిర్ణయిస్తున్నారు. పార్టీ బలంగా ఉన్నచోట ముందుగా అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారు. అదే సమయంలో పార్టీ కాస్త బలహీనంగా ఉన్నచోట కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి గత ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాలేదు. దీంతో రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంపై ఫోకస్‌ పెట్టింది కాంగ్రెస్‌ పార్టీ.

బలమైన నేతలకు గాలం..
చేవెళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి కాంగ్రెస్‌ కండువా కప్పారు. ఇలా బలమైన నేతలను పార్టీలోకి ఆకర్షిస్తున్న హస్తం పార్టీ పెద్దలు చేవెళ్లలో గెలుపు గుర్రంగా మహేందర్‌రెడ్డి భార్య సునీతను బరిలోకి దింపాలని నిర్ణయించారు. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానమైన చేవెళ్లలో కాంగ్రెస్‌ జెండా ఎగరేయాలన్నదే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు కాంగ్రెస్‌ పెద్దలు.

కాంగ్రెస్‌ ప్లాన్‌ ఎంతవరకు వర్కౌట్‌ అవుతుందో..
ఇలా పార్టీలోకి వలసలు ప్రోత్సహిస్తూ వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలవాలనుకుంటన్న కాంగ్రెస్‌ పార్టీ.. నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్లకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతానికి రెండు సీట్లపై స్పష్టత ఇచ్చిన హస్తం పార్టీ.. త్వరలో మిగిలిన సీట్లకు అభ్యర్థులను ప్రకటించే చాన్స్‌ ఉందంటున్నారు. మొత్తానికి టార్గెట్‌ 14లో కాంగ్రెస్‌ ప్లాన్‌ ఎంతవరకు వర్కౌట్‌ అవుతుందనేది చూడాలి.

Also Read : దమ్ముంటే.. ఒక్క సీటు గెలిచి చూపించు- కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్