CM Revanth Reddy : దమ్ముంటే.. ఒక్క సీటు గెలిచి చూపించు- కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

కేసీఆర్ ఇంటి పెద్ద మోదీనే. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చీకట్లో కలిసి ఉంటున్నారు. పొద్దునేమో తిట్టుకున్నట్టు ఉంటున్నారు.

CM Revanth Reddy : దమ్ముంటే.. ఒక్క సీటు గెలిచి చూపించు- కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

CM Revanth Open Challenge To KTR

చేవెళ్ల జన జాతర సభలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా కేటీఆర్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. వేదిక నుంచి కేటీఆర్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో దమ్ముంటే.. ఒక్క సీటు గెలిచి చూపించు
అని కేటీఆర్ కు ఓపెన్ చాలెంజ్ చేశారు సీఎం రేవంత్. ప్రభుత్వం కూలిపోతుంది అనే వాళ్ళపైనా సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలా అనే వాళ్లను వేప చెట్టుకు కట్టేయాలని కాంగ్రెస్ కార్యకర్తలతో ఆవేశంగా చెప్పారు సీఎం రేవంత్.

”కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కార్యకర్తల చెమట ఉంది. కార్యకర్తల త్యాగం ఎప్పటికీ మరిచిపోను. సెప్టెంబర్ 17న సోనియా ఇచ్చిన మాటను నెరవేరుస్తాం. ఏడాదిలో నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. నిరుద్యోగులు ఉద్యోగం ఇస్తే మేం ప్రమాణ స్వీకారం చేశాం. విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తే బీఆర్ఎస్ నాయకులకు కడుపు మండుతోందా? మార్చి 2న మరికొన్ని ఉద్యోగాల ప్రకటన చేస్తాం. త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తాం. ఇన్ని మంచి పనులు చేస్తుంటే కనీసం అభినందించరా? కేసీఅర్ నువ్వు మనిషివా? మానవ రూపంలో ఉన్న మృగానివా?

ప్రభుత్వం కూలిపోతుంది అనే వాళ్ళని వేపచెట్టుకు కట్టేయండి. కేటీఆర్.. దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపెట్టు. అయ్య పేరు చెప్పుకొని నేను కుర్చీలో కూర్చోలేదు. అక్రమ కేసులు పెట్టినా కొట్లాడి కుర్చీలో కూర్చున్నా. కార్యకర్తలు భుజాలపై మోసినంత కాలం నన్ను, నా కుర్చీని ఎవరూ తాకలేరు. ఉన్న పేపర్లు, టీవీలు అన్నీ కేసీఆర్ చుట్టాలవే. మాకు ఏ ట్యూబ్ లు లేవు. మీ ట్యూబ్ లైట్స్ పగలగొడతాం. రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకున్న మీ నుండి రాష్ట్రాన్ని ప్రజలు కాపాడుకున్నారు.

సోనియా మాట శిలాశాసనం. మహాలక్ష్మి గ్రూపుల ద్వారా మహిళలను కోటీశ్వరులను చేస్తాం. ఏ ఆడబిడ్డ కంట్లో కన్నీళ్లు కారనివ్వం. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందిస్తాం. అర్హులైన వారికి పథకాలు ఇవ్వకపోతే అధికారులను అడగండి.

ఒక్క టికెట్ రానివ్వను. కేటీఆర్ కి సవాల్ విసిరాను. కార్యకర్తలు కష్టపడి 14 సీట్లను గెలిపించాలి. కార్యకర్తలను సర్పంచ్ లుగా, వార్డు మెంబర్లుగా గెలిపించుకున్నప్పుడే మేం సక్సెస్ అయినట్టు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తాం. నేను కార్యకర్తలకు నాయకుడిని. కార్యకర్తలను గెలిపించే బాధ్యత నాది. రోజుకు 18 గంటలు పని చేస్తున్నాం. మళ్ళీ నియోజకవర్గాలకు వస్తాను. కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో వింటాను.

గుజరాత్ మోడల్ అంటే ఇళ్లను తగలపెట్టడమా? గుజరాత్ మోడల్ అంటే రైతులను కాల్చి చంపడమా? గుజరాత్ మోడల్ అంటే పెట్టుబడిదారులను బెదిరించి గుజరాత్ కి తీసుకెళ్లడమా? గుజరాత్ మోడల్ అంటే మాటవినని వాళ్ళని జైల్లో పెట్టడమా? కేసీఆర్, మోదీ అల్లం బెల్లంలాగా అలయ్ బలయ్ చేసుకున్నారు. కేసీఆర్ ఇంటి పెద్ద మోదీనే. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చీకట్లో కలిసి ఉంటున్నారు. పొద్దునేమో తిట్టుకున్నట్టు ఉంటున్నారు. ఇక్కడి బీజేపీ నాయకుడు మనిషి మంచోడే. కానీ ఆయన పార్టీ మంచిది కాదు. ఏదో ఆశించి బీజేపీలోకి వెళ్ళానని ఆయనే అన్నారు” అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read : వారికి మాత్రమే రూ.500కే గ్యాస్ సిలిండర్.. ప్రభుత్వం జీవో జారీ, మార్గదర్శకాలు ఇవే