2024 Elections: రాహుల్ గాంధీ, నితీశ్ కుమార్, మమత బెనర్జీ.. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు?

విపక్షాల కూటమికి ప్రయత్నాలు ప్రారంభించి, వాటికి ఆచరణ రూపం తీసుకు వచ్చిన ఘనత బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‭దే. వాస్తావానికి ఆయన దేశ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని అవ్వాలనే ఆశతో కూటమి ప్రయత్నాలు చేశారు..

2024 Elections: రాహుల్ గాంధీ, నితీశ్ కుమార్, మమత బెనర్జీ.. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరు?

2024 Elections- INDIA Front: దశాబ్ద కాలంగా భారతీయ జనతా పార్టీ చాలా దూకుడు మీద ఉంది. కేంద్రంలో ఘనమైన మెజారిటీతో అధికారంలో ఉండడమే కాకుండా, దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన సాగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో (2019 ఎన్నికలు) ఎవరికి వారుగా ఒంటరిగా వెళ్లడంతో మరోసారి బీజేపీ ఘన విజయం సాధించిందని ఈసారి విపక్షాలన్నీ ఏకమయ్యాయి. బహుజన్ సమాజ్ పార్టీ, అకాలీ దళ్ లాంటి పార్టీలు అటు ఎన్డీయేలో కాకుండా, ఇటు విపక్షాల ఇండియాలో కాకుండా తటస్థంగా ఉన్నాయి. కానీ సుమారు 26 పార్టీలు ఇండియా పేరుతో కూటమి కట్టాయి.

Mayawati: దళితుల విషయంలో కులతత్వ మీడియా పద్దతి మారాలంటూ మాస్ వార్నింగ్ ఇచ్చిన మాయావతి

అయితే ఎన్డీయే నుంచి ప్రధాని అభ్యర్థిగా ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారు. అయితే ఇండియా నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. రాహుల్ గాంధీ, నితీశ్ కుమార్, మమతా బెనర్జీ లాంటి పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఎటువైపు కూడా క్లారిటీ దొరకడం లేదు. అసలు ప్రధాని అభ్యర్థి లేకుండానే ఎన్నికలు వెళ్లాలనే ప్రతిపాదన ఇండియా కూటమిలో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తేనే విపక్షాల నాయకత్వాన్ని ఒక రూపు వస్తుందని, మోదీకి ఎదురుగా నిల్చోవడానికి అనుకూలంగా ఉంటుందనే వాదనలూ వస్తున్నాయి.

రాహుల్ గాంధీ..
యూపీఏ-2 ప్రభుత్వం పూర్తైన తర్వాత 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నాటికే కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ అనధికారిక ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. 2019 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ అధినేతగా మరో అడుగు ముందుకు వేసి తన అభ్యర్థిత్వాన్ని బలపర్చుకున్నారు. కానీ అధికారికంగా ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై చూసుకుంటున్నప్పటికీ.. ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే విషయంలో కాంగ్రెస్ చాలా వెనకాడుతోంది. ఇక ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా రాహులేనని కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పటికీ అందుకు విపక్షాలు సముఖంగా లేవు. రాహుల్ గాంధీ రాజకీయ అనుభవం, పనితీరు అంతకు సరిపోదనే అభిప్రాయాన్ని ఇండియా కూటమిలోని అనేక విపక్ష పార్టీలు గతంలో అనేకసార్లు అన్నాయి. అయితే కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా రాహుల్ ను ముందుకు తీసుకురావాలని శథవిధాలా ప్రయత్నిస్తోంది.

నితీశ్ కుమార్..
విపక్షాల కూటమికి ప్రయత్నాలు ప్రారంభించి, వాటికి ఆచరణ రూపం తీసుకు వచ్చిన ఘనత బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‭దే. వాస్తావానికి ఆయన దేశ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని అవ్వాలనే ఆశతో కూటమి ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఆయనకు ఒక్క ఆర్జేడీ తప్ప ఇప్పటి వరకు ఎవరూ మద్దతు ఇవ్వలేదు. విపక్షాల మొదటి సమావేశం అన్నీ తానై నడిపించినప్పటికీ.. బెంగళూరులో జరిగిన రెండవ సమావేశం నాటికి పరిస్థితులు చేజారిపోయాయి. కూటమి పూర్తిగా కాంగ్రెస్ కంట్రోల్ కి వెళ్లిపోయింది. దీంతో ప్రధాని అభ్యర్థి పక్కన పెడితే కూటమి కన్వినర్ పదవిపై కూడా నితీశ్ ఆశలు వదిలేసుకున్నారు.

మమతా బెనర్జీ..
కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి.. సొంతంగా పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చిన పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ.. వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా ఘన విజయం సాధించి బెంగాల్ మహా సంస్థానానికి తాను మకుఠం లేని మహారాణినని నిరూపించుకున్నారు. అయితే మూడోసారి ముఖ్యమంత్రి కాగానే మమతకు దేశ రాజకీయాల్లోకి వెళ్లాలనే కోరిక కలిగింది. అనుకున్నదే తడవుగా గోవా, త్రిపుర రాష్ట్రాల్లో ప్రయత్నం చేసినప్పటికీ బంగపాటు ఎదురైంది. దీంతో ఆ ప్రయత్నాలు మానేసి బెంగాల్ కే పరిమితం అయ్యారు. అయితే నితీశ్ ప్రయత్నాల అనంతరం ఆమెకు మరోసారి ప్రధాని పదవిపై ఆశలు రేకెత్తినప్పటికీ.. కాంగ్రెస్ ఆ అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు.

PM Race: మొదటిసారి ప్రధాని రేసులో మోదీని దాటేసిన రాహుల్.. సర్వేలో చాలా చిత్రమైన అభిప్రాయం వ్యక్తం చేసిన ప్రజలు

ఎటు నుంచి చూసినా రాహుల్ గాంధీకే ఇండియా కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ముందు అది ప్రకటిస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే.. అనధికారికంగానైనా రాహులేనని స్పష్టమవుతోంది. 2019కి ముందు యూపీఏ కూటమిలోని చాలా పార్టీలు దీనిపై మౌనంగా ఉన్నప్పటికీ స్టాలిన్ మాత్రం రాహులే ప్రధాని అభ్యర్థని బహిరంగంగానే ప్రకటించారు. ఎన్సీపీ, శివసేన, లెఫ్ట్ పార్టీలు ఇందుకు అనుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఆ రేసులో తాను లేనని నితీశ్ చెప్పారు. మమతా బెనర్జీని ఒక్క కాంగ్రెస్ పార్టీయే కాదు, మిగతా ఏ పార్టీలు ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకోవు. దీంతో అవకాశాలు రాహుల్ గాంధీవైపే కనిపిస్తున్నాయి. కానీ అంతిమ నిర్ణయం తీసుకునే వరకు ఇదే కచ్చితంగా చెప్పలేము.