భీమవరం జనసేన అభ్యర్థి ఖరారు? పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..!

ఇటీవల పవన్ కల్యాణ్ భీమవరం వచ్చినప్పుడు ఆంజనేయులు నివాసానికి వెళ్లి కలిశారు.

భీమవరం జనసేన అభ్యర్థి ఖరారు? పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..!

Who Is Bhimavaram Janasena Candidate

Ramanjaneyulu Pulaparthi : పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారానికి చెక్ పడింది. ఇప్పుడు అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు జనసేన ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. భీమవరం జనసేన అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు పేరు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలవనున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ భీమవరం వచ్చినప్పుడు ఆంజనేయులు నివాసానికి వెళ్లి కలిశారు.

ఈ ఎన్నికల్లో భీమవరం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ బరిలోకి దిగుతారు అనే ప్రచారం నడిచింది. పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు, ఆయనకే ఓటు వేయాలని అటు జనసైనికులు కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో భీమవరం నుంచి పవన్ పోటీ చేస్తారా? లేదా? అన్నదానిపై స్పష్టమైన ప్రకటన ఏదీ చేయలేదు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పులపర్తి రామాంజనేయులు పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. భీమవరం నుంచి జనసేన అభ్యర్థిగా రామాంజనేయులును బరిలోకి దించాలి అనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. జనసేన ఆఫీసు నుంచి రామాజంనేయులుకు పిలుపు వచ్చింది. దీంతో రామాంజనేయులు వెంటనే హైదరాబాద్ కు పయనం అయ్యారు. జనసేనాని పవన్ తో ఆయన భేటీ కానున్నారు.

ఇటీవల భీమవరం వెళ్లిన పవన్ కల్యాణ్.. పులపర్తి రామాంజనేయులు ఇంటికి వెళ్లారు. అలాగే టీడీపీ నేత సీతా రామలక్ష్మి ఇంటికి వెళ్లారు. బీజేపీ నేత నివాసానికి వెళ్లారు పవన్. వారందరిని మర్యాదపూర్వకంగా కలిశానని పవన్ తెలిపారు. పులపర్తి రామాంజనేయులు.. పవన్ కు సన్నిహితుడు. భీమవరం నుంచి పోటీ చేసే ఆలోచన తనకు ఉన్నట్లు పవన్ కు తెలిపారు రామాంజనేయులు.

ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి పార్టీల భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభ తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇంతలో అనూహ్యంగా పులపర్తి రామాంజనేయులు పేరు తెరపైకి రావడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. పులపర్తి రామాంజనేయులు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పై పోటీ చేశారు. పవన్ కల్యాణ్ ఓటమికి పులపర్తి రామాంజనేయులే కారణం అని అంతా భావించారు. ఇప్పుడు పులపర్తి రామాంజనేయులుని పిలిచి భీమవరం జనసేన అభ్యర్థిగా పోటీ చేసేందుకు అనువుగా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.

Also Read : ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..

పూర్తి వివరాలు..