Mahabubabad MP : బీఆర్ఎస్, బీజేపీకి సవాల్‌గా మారిన గెలుపు.. మహబూబాబాద్‌లో రసవత్తర రాజకీయం

అసెంబ్లీ ఫలితాల జోరు... క్షేత్రస్థాయి బలం, బలగంతో కాంగ్రెస్ దూకుడుగా కనిపిస్తుండగా, బీఆర్ఎస్, బీజేపీలు మొత్తం యంత్రాగాన్ని మొహరించి.. కాంగ్రెస్ ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి.

Mahabubabad MP : బీఆర్ఎస్, బీజేపీకి సవాల్‌గా మారిన గెలుపు.. మహబూబాబాద్‌లో రసవత్తర రాజకీయం

Mahabubabad MP : తెలంగాణలో లోక్‌సభ రేస్ ఆసక్తికరంగా మారుతోంది. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్…. అదే ఊపుతో పార్లమెంట్లో విజయ పతాకం ఎగరేయాలని ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్ జోరుకు బ్రేకులు వేసేలా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా పావులు కదుపుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికంగా గెలిచిన మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో గెలువడం ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీకి సవాల్‌గా మారనుంది. అప్పుడు కాంగ్రెస్ కు ఓటేశారు కనుక… ఇప్పుడు తమ పార్టీకి ఓటేస్తారంటూ ఆ రెండు పార్టీలూ ఆశలు పెట్టుకుంటున్నాయి… కారు, కమలం ఆశలు ఫలిస్తాయా? మరోసారి కాంగ్రెస్ హవాయే కొనసాగుతుందా? మానుకోటలో ఎవరి సత్తా ఎంతో చూద్దాం….

గత మూడు ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు నేతలు మరోసారి పోటీ..
తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన మహబూబాబాద్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి గత మూడు ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన ముగ్గురు నేతలే తాజా ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచిన బలరాం నాయక్ మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతుండగా.. 2014లో బిఆర్ఎస్ తరఫున గెలిచిన సీతారాం నాయక్… ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇక సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత మరోసారి బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఈ ముగ్గురికి టికెట్లు ఖరారు అవ్వడంతో ప్రస్తుతం వ్యూహాలు, ప్రతివ్యూహాలతో మానుకోట రాజకీయం రక్తి కడుతోంది..

కాంగ్రెస్ జోరు..
ముఖ్యంగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ జోరు ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల ఘన విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ నుంచి గెలిచిన భద్రచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా తాజాగా హస్తం గూటికే చేరిపోవడంతో మహబూబాబాద్ నియోజకవర్గాన్ని తన గుప్పెట పెట్టుకుంది హస్తం పార్టీ…

2009లో ఏర్పడిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి మూడు సార్లు ఎన్నిక జరుగగా… రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సీతారాం నాయక్, కవితలు గెలిచారు. అంతకు ముందు బలరాం నాయక్ గెలువగా.. ఇప్పుడు ఆ ముగ్గురూ రెండోసారి ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టేందుకు బరిలో దిగిపోయారు. గతంలో ఒకసారి ఎంపీగా గెలిచిన వారు మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టకపోవడంతో ఇప్పుడు ఈ ముగ్గురిలో ఎవరిని అదృష్టం వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇద్దరు మాజీ ఎంపీలు వర్సెస్ సిట్టింగ్ ఎంపీ..
2009లో ఎంపీగా ఎన్నికైన బలరాం నాయక్, 2014, 2019 ఎన్నికల్లో వరసగా ఓడిపోయారు. 2014లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన సీతారాం నాయక్… 2019లో టికెట్ దక్కకపోగా, ప్రస్తుతం బీజేపీలో చేరి కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఇక 2019లో ఎంపీగా ఎన్నికైన కవితకు ఫస్ట్‌ లిస్టులోనే టికెట్ ఖరారు చేసింది కారు పార్టీ. ఇలా ఇద్దరు మాజీ ఎంపీలు… సిట్టింగ్ ఎంపీతో అమీతుమీ తేల్చుకోడానికి సిద్ధం కావడం ఆసక్తిరేపుతోంది.

కారు పార్టీకి అసలైన సవాల్‌..
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తాచాటాలని చూస్తోంది. టార్గెట్ -14 పెట్టుకున్న కాంగ్రెస్.. మానుకోట పార్లమెంటును తన ఖాతాలో వేసుకునేందుకు వ్యుహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీ అభ్యర్ధి పోరిక బలరాం నాయక్ గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించడంతో… క్షేత్రస్థాయిలో దూసుకుపోతోంది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి 6 లక్షల 85 వేల 897 ఓట్లు వచ్చాయి. ఒక్క భద్రాచలం తప్ప, మిగిలిన అన్నిచోట్ల కాంగ్రెస్ హవాయే నడిచింది. ఇక బీఆర్‌ఎస్‌కు ఏడు నియోజకవర్గాల్లో కలిపి 4 లక్షల 43 వేల910 ఓట్లు రాగా, బీజేపీకి కేవలం 34 వేల 431 ఓట్లు మాత్రమే వచ్చాయి. అసెంబ్లీ ఓట్ల ఆధారంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు మధ్య భారీ తేడా కనిపిస్తుండటం…. ఆ తేడాను అధిగమించి విజయతీరాలకు చేరుకోవడమే కారు పార్టీకి అసలైన సవాల్‌గా చెబుతున్నారు.

విజయంపై నమ్మకంగా ఉన్న కవిత..
ఐతే బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ కవిత తన విజయంపై నమ్మకంతో పనిచేస్తున్నారు. ఎంపీగా తాను అందించిన సేవలతోపాటు తన తండ్రి, సీనియర్ నేత రెడ్యానాయక్ ప్రభావం కలిసివస్తుందని ఆశిస్తున్నారు కవిత. గతంలో మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతోపాటు పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్లో రెడ్యానాయక్ పరపతి పనిచేస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. అదేవిధంగా కవిత అత్తవారి కుటుంబానికి ఇల్లెందులో రాజకీయాలకతీతంగా ఓట్లు పడతాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ మూడు నియోజకవర్గాలతోపాటు బీఆర్ఎస్ ఓటుబ్యాంకుతో గట్టెక్కుతానని ధీమా ప్రదర్శిస్తున్నారు సిట్టింగ్ ఎంపీ…

కేంద్ర సర్కార్ పనితీరే గెలిపిస్తుందని ధీమా..
ఇదే సమయంలో కేంద్ర సర్కార్ పనితీరే తనకు విజయం తెచ్చిపెడుతుందంటున్నారు బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్. ములుగు, నర్సంపేట నియోజకవర్గాల్లో మెజార్టీ వస్తుందని ధీమాగా ఉన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన సీతారాం నాయక్ కేయూలో ప్రొఫెసర్గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా వ్యవహరించి… ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కక, కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు టికెట్ ఆశించారు. కానీ, ఆయనకు బీఆర్ఎస్ చాన్స్ ఇవ్వకపోవడంతో ఇటీవల బీజేపీలో చేరారు. కమలం కండువా కప్పుకున్న మూడు రోజులకే ఆ పార్టీ ఎంపీ టికెట్ కట్టబెట్టింది. ప్రధాని మోదీ ఇమేజ్ తో మహబూబాబాద్ లో సునాయాశంగా గెలుస్తానని ధీమాగా ఉన్నారు సీతారాం నాయక్.

మొత్తానికి మహబూబాబాద్ లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అసెంబ్లీ ఫలితాల జోరు… క్షేత్రస్థాయి బలం, బలగంతో కాంగ్రెస్ దూకుడుగా కనిపిస్తుండగా, బీఆర్ఎస్, బీజేపీలు మొత్తం యంత్రాగాన్ని మొహరించి.. కాంగ్రెస్ ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి. రెండుసార్లు వరుసగా ఓడిపోయిన బలరాం నాయక్… పార్టీ బలగం అండతో ఈ సారైనా విజయం సాధిస్తారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.

 

Also Read : లోక్‌స‌భ‌ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్: కేటీఆర్