ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యవహారం, వెనకడుగు వేయడం వెనుక జగన్ వ్యూహం ఇదే

  • Published By: naveen ,Published On : August 1, 2020 / 02:14 PM IST
ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యవహారం, వెనకడుగు వేయడం వెనుక జగన్ వ్యూహం ఇదే

Updated On : August 1, 2020 / 2:51 PM IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వ్యవహారంలో సీఎం జగన్‌ వ్యూహాత్మకంగానే వెనుకడుగు వేశారంటున్నారు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేందుకు ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధపడే జగన్‌.. ఈ విషయంలో మాత్రం కాస్త మెత్తబడ్డారట. ఏపీ హైకోర్టు పలుమార్లు చెప్పినా పట్టించుకోని ఆయన.. సుప్రీం మాటను కూడా అలానే తీసుకున్నారు. దీంతో మరోసారి దేశ సర్వోన్నత న్యాయస్థానం కన్నెర్ర చేయడంతో అర్ధరాత్రి ఓ జీవోను జారీ చేసింది జగన్‌ సర్కార్‌. ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను పునర్నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో జగన్‌ వ్యవహార శైలి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.



సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది:
కరోనా కాలంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు సరికావంటూ వాయిదా వేస్తూ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంపై ఏపీ సర్కారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. ఆయన్ను అనూహ్యంగా పదవి నుంచి తప్పించటం తెలిసిందే. ఏపీ సర్కారు నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ.. తర్వాతి కాలంలో సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. సంస్కరణల పేరుతో పదవీ కాలాన్ని కుదిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ సర్కారు.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం ముగిసిందని పేర్కొంటూ తమిళనాడు నుంచి అత్యవసరంగా రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకోవటం అప్పట్లో సంచలనంగా మారింది.



దిగి రాక తప్పలేదు:
ఈ విషయంలో పట్టు వదలని నిమ్మగడ్డ.. పలుమార్లు న్యాయస్థానం ముందుకెళ్లారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని వాదించారు. ఆయనకు అనుకూలంగా రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పింది. అయినా సర్కార్‌ పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసు కింద మరోసారి నిమ్మగడ్డ కోర్టును ఆశ్రయించారు. అప్పుడు కూడా ఆయనకు అనుకూలంగా తీర్పునిస్తూ.. రాష్ట్ర గవర్నర్‌ను కలుసుకోవాలని స్పష్టం చేసింది. ఈలోపు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. కానీ, అందుకు సుప్రీం తిరస్కరించింది. రెండోసారి కూడా సుప్రీంను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది.

నిమ్మగడ్డ విషయంలో వెనక్కితగ్గడానికి కారణం ఇదే:
నిమ్మగడ్డను తిరిగి నియమించే విషయంలో పట్టుదలకు వెళ్లిన జగన్ సర్కారు.. చివరకు దారులన్నీ మూసుకుపోవటంతో వెనక్కి తగ్గక తప్పలేదంటున్నారు. కానీ, ఈ విషయంలో జగన్‌ వ్యూహాత్మకంగానే వ్యవహరించారని అంటున్నారు. నిమ్మగడ్డ పదవీకాలం మరికొద్ది నెలల్లో ముగియబోతోంది. ఈలోపు ఎలాంటి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. కరోనా తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. పరిస్థితులన్నీ సద్దుమణిగే నాటికి నిమ్మగడ్డ పదవీకాలం ముగుస్తుందనే ఉద్దేశంతోనే జగన్‌ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. దీనివల్ల సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవించినట్టు ఉంటుందనే ఉద్దేశంతోనే ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను పునర్నియమిస్తూ జీవో జారీ చేసిందంటన్నారు.



ఎవరు గెలిచినట్టు, ఎవరు ఓడినట్టు:
ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తోంది. అనవసర పట్టింపులకు పోయి కోర్టులతో మొట్టికాయలు వేయించుకుందని అంటోంది. హైకోర్టు మొదటి సారి తీర్పు ఇచ్చినప్పుడే ఈ పని చేసి ఉంటే బావుండేదని అంటోంది. నిమ్మగడ్డ కూడా తాను నైతిక విజయం సాధించానని చెప్పుకుంటున్నారు. కానీ, అసలు ఈ విషయంలో జగన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారని వైసీపీ నేతలు అంటున్నారు. మరి ఈ విషయంలో ఎవరిది విజయం? ఎవరిది పరాజయం? అన్నది ఇతమిద్ధంగా తేల్చడం కష్టం. కానీ, అసలు విజయం కోర్టులదే అంటున్నారు జనాలు.