Revanth Reddy : కర్నాటక ఎన్నికల్లో మోదీని ఓడించాలని కేసీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదు- రేవంత్ రెడ్డి
Revanth Reddy : రాముడిని మోసం చేసిన బీజేపీని భజరంగభలి ఓడించారు. మోదీకి, కేసీఆర్ కు పేరులో తేడా ఉంది తప్ప విధానాల్లో లేదు.

Revanth Reddy(Photo : Twitter, Google)
Revanth Reddy Slams KCR : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఇక, తెలంగాణ కాంగ్రెస్ లో ఆ జోష్ ఇంకాస్త ఎక్కువగానే ఉంది. కర్ణాటక ఫలితాలు తెలంగాణపైనా ప్రభావం చూపుతాయని, తెలంగాణలోనూ కర్ణాటక ఫలితాలు (Karnataka Results) రిపీట్ అవుతాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ పై ఆయన కాంగ్రెస్ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
రాముడిని మోసం చేసిన బీజేపీని భజరంగభలి ఓడించారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఓటమిని నరేంద్ర మోదీ ఓటమిగా అభివర్ణించారు. ఎన్నికల్లో నెగ్గేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డిందన్నారు. కర్ణాటక ఫలితాలు మాకు వెయ్యేనుగుల బలం అన్నారు రేవంత్ రెడ్డి. కర్ణాటక ప్రభావం తెలంగాణపై కచ్చితంగా ఉంటుందన్నారు.(Revanth Reddy)
Also Read..Rahul Gandhi : కర్ణాటకలో ప్రేమ దుకాణం తెరుచుకుంది.. ప్రతి రాష్ట్రంలో ఇదే రిపీట్ అవుతుంది
కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపవు అంటూ.. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేటీఆర్ ట్వీట్ చివరి దశలో ఉన్న క్యాన్సర్ పేషంట్ కోరికలాంటిదన్నారు. తెలంగాణలో కర్ణాటక ఫలితాల ప్రభావం ఉండకూడదని ఆయన కోరుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
దక్షిణ భారతంలో బీజేపీకి స్థానం లేదన్నారు. ఇక్కడి ప్రజలు బీజేపీని తిరస్కరించారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పెద్ద తేడా లేదన్నారు. పార్లమెంటులో అన్ని సందర్భాల్లో మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో మోదీని ఓడించాలని కేసీఆర్ ఎప్పుడూ ప్రచారం చేయలేదన్నారు. మహారాష్ట్రలో మీటింగ్స్ పెట్టిన కేసీఆర్.. కర్ణాటకలో మీటింగ్ పెట్టి మోదీని ఓడించాలని ఎందుకు చెప్పలేదని నిలదీశారు.(Revanth Reddy)
కర్ణాటకలో ఉన్నట్లే తెలంగాణలోనూ 40శాతం సర్కార్ ఉందన్నారు. మోదీకి, కేసీఆర్ కు పేరులో తేడా ఉంది తప్ప విధానాల్లో లేదన్నారు. దళితబంధులో 30శాతం తీసుకుంటున్నారని తన ఎమ్మెల్యేలపై కేసీఆరే ఆరోపించారని గుర్తు చేశారు. లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను రూ. 7,388 కోట్లకే అమ్ముకున్నారని కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి.
Also Read..Minister KTR : కేరళ స్టోరీ సినిమాలాగే కర్ణాటక ఫలితాలు కూడా .. తెలంగాణలో అవి పనిచేయవ్ ..
కర్నాటకలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 224. కాంగ్రెస్ 136 స్థానాల్లో గెలుపొందింది. హస్తం పార్టీకి స్పష్టమైన మెజారీ దక్కింది. ఇక, ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 113. కాగా, మేజిక్ ఫిగర్ కు 23 స్థానాలు ఎక్కువే గెలిచిన హస్తం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యాలయాల దగ్గర పండగ వాతావరణం నెలకొంది. స్వీట్లు పంచుకుంటూ, బాణసంచా కాల్చుతూ, ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.
అధికార బీజేపీకి కన్నట ఓటర్లు షాక్ ఇచ్చారు. బీజేపీ 64 సీట్లకే పరిమితమైంది. జనతాదళ్ (ఎస్) 20 స్థానాల్లో నెగ్గగా, ఇతరులు 4 స్థానాలు కైవసం చేసుకున్నారు.(Revanth Reddy)