అధినేతలో కొత్త మార్పుతో సంబరపడిపోతున్న తెలుగు తమ్ముళ్లు!

టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారశైలిపై పార్టీలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఆమడ దూరంలో పెట్టే కార్యకర్తలను ఇప్పుడు దగ్గరికి తీస్తున్నారని, అవసరమైతే స్వయంగా ఫోన్ చేసి వారిని పరామర్శిస్తున్నారని అనుకుంటున్నారు.
ఓటమి నేర్పిన గుణపాఠం ఏమో కానీ అధినేతలో పూర్తి స్థాయి మార్పు కనిపిస్తోందని సంబరపడిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. మొన్న నెల్లూరు జిల్లాకు చెందిన సామాన్య కార్యకర్త శ్రీకాంత్ రెడ్డి పోలీసులతో జరిపిన సంభాషణ ఆడియో లీక్ అవడం చంద్రబాబు దృష్టికి వచ్చింది. వెంటనే తానే స్వయంగా శ్రీకాంత్‌రెడ్డికి ఫోన్ చేసి అభినందించి, ధైర్యం నూరిపోశారు చంద్రబాబు.
బాధితులకు ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారంట :
సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే టీడీపీ కార్యకర్తలను పోలీసులు కేసులు బుక్ చేసి అదుపులోకి తీసుకుంటున్నారు. స్వయంగా ఆ భాదితులతో టచ్‌లోకి వెళ్తున్నారట బాబు. వారి కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో మాట్లాడుతూ మనోధైర్యాన్ని కల్పిస్తున్నారని అంటున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక 800 మంది సామాన్య కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారని, 33 మంది మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులపై అక్రమ కేసులు నమోదయ్యాయని టీడీపీ చెబుతోంది. వారందరికీ న్యాయ సహాయం అందిస్తూ వారి కుటుంబ సభ్యులకు స్వయంగా ఫోన్లు చేస్తూ చంద్రబాబు ధైర్యం చెబుతున్నారని అంటున్నారు. కేసులో ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి స్థానిక నేతలను, జిల్లా నాయకులను రంగంలోకి దింపుతున్నారు.
అంతా ఫోన్లలోనే నడిపిస్తున్న బాబు :
ఈ మధ్యకాలంలో అరెస్టయిన అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, కూన రవికుమార్ కుటుంబ సభ్యులను స్వయంగా లోకేశ్ వెళ్లి పరామర్శించారు. కొవిడ్ నిబంధనలు ఉన్న నేపథ్యంలో తాను జిల్లాల్లో పర్యటించకుండా అంతా ఫోన్లోనే నడిపిస్తున్నారు చంద్రబాబు. అవసరాన్ని బట్టి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నాయకులకు టచ్‌లోకి వెళ్లి తగిన సూచనలు చేస్తున్నారట.
పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా అధినేత నుంచి స్పందన కనిపించడంతో తమ్ముళ్లు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారట. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుముక. భుజాలు అరిగేలా జెండాలు మోస్తూ నమ్ముకున్న పార్టీల కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. టీడీపీలో అయితే ఇంకా ఎక్కువ.
2019లో ఓటమే కారణమా? :
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి దాదాపు 60 లక్షల పైగా కార్యకర్తలున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకున్న నాథుడే లేడంటున్నారు. ఇప్పుడు అధినేతలో వచ్చిన మార్పు గురించి సంతోషం వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు.. గతాన్ని తలచుకుని కుమిలిపోతున్నారట. పార్టీ ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా మమ్మల్ని కరివేపాకులా తీసివేసే వారని చివరికి నామినేటెడ్ పోస్టులలో కూడా అవకాశం ఇవ్వకుండా అవమానపరిచారని ఆవేదన చెందుతున్నారు.
2004లో అధికారం కోల్పోయినప్పుడు కూడా కార్యకర్తలను నిర్లక్ష్యం చేశానని, ఇక ఆ పొరపాటు జరగనివ్వనంటూ పలుమార్లు బహిరంగ వేదికలపై వ్యాఖ్యానించారు చంద్రబాబు. 2014 అధికారంలోకి వచ్చాక పార్టీ నాయకులను, కార్యకర్తలను మళ్లీ నిర్లక్ష్యం చేశారు. 2019లో పార్టీ ఓటమికి అది కూడా ఓ కారణమని తెలుగు తమ్ముళ్లు అంటారు.
అప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదని :
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలను నెత్తిన పెట్టుకొనే చంద్రబాబు.. ఆ తర్వాత కలవడానికి కూడా సమయం ఇవ్వరని వాపోతున్నారు. గత పాలనలో అయితే అసలు మంత్రులకే ప్రాధాన్యం ఇవ్వలేదని, అంతా అధికారులు చెప్పినట్టే విని పుట్టి ముంచుకున్నారని అధినేతను ఇప్పటికీ దెప్పి పొడుస్తున్నారు నాయకులు.
అధికారంలో ఉన్నప్పుడు అధినేతకు కార్యకర్తలు, నాయకులు అవినీతిపరుల్లా కనిపిస్తారని, అధికారులను మాత్రం నెత్తిన ఎక్కించుకుంటారని ఆనాటి పరిస్థితులు తలచుకొంటున్నారు టీడీపీ కార్యకర్తలు. చాలా మంది కార్యకర్తలు యాక్టివ్‌గా లేకపోవడానికి గతం కూడా కారణమని ఇప్పుడు అధినేత గుర్తించారు.
అందుకే పూర్తిగా తన స్టైల్‌ను మార్చి కార్యకర్తలతో పరిస్థితులు బట్టి ఫోన్లో కూడా సంభాషిస్తున్నారు. కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడుతున్న కాల్ రికార్డులు సోషల్ మీడియాలో టీడీపీ నేతలు పోస్ట్ చేసి, తమ నాయకుడు మారిపోయారంటూ వైరల్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబులో నిజంగా మార్పు వచ్చిందా? కార్యకర్తలు ఇంతకు ముందులా పార్టీ కోసం పనిచేస్తారా తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందేనంటున్నారు జనాలు.