తెలంగాణ లో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో వాయిదా పడ్డ 10వతరగతి పరీక్షలను హైకోర్టు ఆదేశాల మేరకు, కొవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్ 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జూన్ 8వ తేదీ నుంచి.. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా నిర్వహించనున్నారు.
పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలన్న న్యాయస్థానం సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఇందుకోసం అదనంగా 26,422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. పదవతరగతి పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య జరుగుతాయి.
> జూన్ 8న ఇంగ్లీష్ మొదటి పేపర్
> జూన్ 11న ఇంగ్లీష్ రెండో పేపర్
> జూన్ 14న గణితము మొదటి పేపర్
> జూన్ 17న గణితము రెండో పేపర్
> జూన్ 20న సైన్స్(భౌతిక శాస్త్రం) మొదటి పేపర్
> జూన్ 23న సైన్స్(జీవశాస్త్రం) రెండో పేపర్
> జూన్ 26న సోషల్ స్టడీస్ మొదటి పేపర్
> జూన్ 29న సోషల్ స్టడీస్ రెండో పేపర్
> జులై 2న ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ మొదటి పేపర్(సంస్కృతం మరియు అరబిక్)
> జులై 5న ఒకేషనల్ కోర్సు(థియరీ)
ప్రతి రోజూ ప్రతి పరీక్షా కేంద్రాన్ని శానిటైజ్ చేసేలా ఆదేశాలు ఇచ్చామని మంత్రి తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి వచ్చే వారందరికీ మాస్కులు అందజేస్తామని, విద్యార్థులందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఒక్క బెంచ్‌పై ఒక్క విద్యార్థి మాత్రమే కూర్చుంటారని విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఉన్నైట్లెతే వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్ష రాయిస్తామని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఎవరైనా ఇన్విజిలేటర్లకు పైలక్షణాలు ఉంటే.. వారిని విధుల నుంచి తప్పించి రిజర్వులో ఉన్నవారితో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి గ్లౌజులను కూడా సరఫరా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Read: ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే ప్రథమస్థానంలో తెలంగాణ