‘సరస్వతీమాత పూజ’తో బెంగాలీల ‘వసంత పంచమి’ 

  • Published By: veegamteam ,Published On : January 30, 2020 / 06:52 AM IST
‘సరస్వతీమాత పూజ’తో బెంగాలీల ‘వసంత పంచమి’ 

Updated On : January 30, 2020 / 6:52 AM IST

తెలుగు నెలల ప్రకారం ఈరోజు చైత్ర మాసం..మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమిగా వ్యవహరిస్తారు. రుతు సంబంధమైన పర్వదినం కాబట్టి ఈ పండుగకు ఆ పేరు వచ్చింది. ఈ విశేషమైన పంచమిని శ్రీపంచమి, వసంత పంచమి, విద్యాపంచమి, మదన పంచమి, దివ్య పంచమి, మహాపంచమిగా వ్యవహరిస్తారు.

 2020, జనవరి 29వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఈరోజున ఉదయం 10:45 గంటలకు ప్రారంభమై, జనవరి 30 తేదీ మధ్యాహ్నం 1:18 గంటలకు ముగుస్తుంది. పూజా ముహుర్తం : ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:35 గంటలకు ముగుస్తుందని పండితులు తెలిపారు.

దక్షిణాదిలో పెద్దగా వసంత పంచమిని జరుపుకోరు. కానీ బెంగాలీలు మాత్రం వసంత పంచమి పండుగను ఘనంగా జరుపుకుంటారు.   
సరస్వతి జన్మదినోత్సవంగా నిర్వహించే ఈ వేడుకకు ఉత్తర భారతదేశంలో విశేషమైన ప్రాముఖ్యం ఉంది. ముఖ్యంగా బెంగాలీలు వసంత పంచమిని ఘనంగా జరుపుకొంటారు. ‘సరస్వతీమాత పూజ’ను శ్రీపంచమి రోజు నిర్వహిస్తారు. పుస్తకాల్ని, కలాల్ని పూజిస్తారు. శ్రీ పంచమినాడు లక్ష్మీ సరస్వతుల్ని జంటగా ఆరాధించడం ద్వారా లౌకిక సంపద, జ్ఞానశక్తి వృద్ధిచెందుతాయని పురుషార్థ చింతామణి చెబుతోంది.

సరస్వతి వేద విద్య సముల్లాసిని. జ్ఞానానంద పరాశక్తి.‘ప్రణోదేవి సరస్వతి’- అంటూ రుగ్వేదం చదువుల తల్లిని కీర్తించింది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి- స్వరూపాల సమ్మేళనమే శారద. శ్రద్ధ, ధారణ, మేధ, వాగ్దేవి, విధివల్లభ, భక్త జిహ్వాగ్ర సదన, శమాది, గుణదాయిని అనేవి సరస్వతి దివ్య అంశలు. వీటినే సారస్వత శక్తులుగా విశ్లేషిస్తారు. ఘన సారస్వతమూర్తిగా సరస్వతిని విరాట్‌ రూపంలో దర్శిస్తారు.

విష్ణుధర్మోత్తర పురాణం సరస్వతీదేవి యశస్సును, తేజస్సును సవివరంగా విశ్లేషించింది. ఆమె నాలుగు చేతులు నాలుగు దిక్కుల్లో వ్యాపించిన శక్తితత్త్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తాయి. విద్యాదేవిధరించిన పుస్తకం మోక్షవిద్యకు సంకేతం.కమండలం అఖిల శాస్త్రాల సారం. అక్షమాల అనంత కాలానికి ప్రతిబింబం. యోగశాస్త్రరీత్యా మన శరీరంలో మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఉన్న భాగం వీణ రూపాన్ని పోలి ఉంటుంది. ఈ దేహమనే విపంచిని శ్రావ్యంగా రవళింపజేయడం ద్వారా ఆధ్యాత్మిక, యోగశక్తుల్ని ఉద్దీపనం చేయమని శ్రీవాణిని ప్రార్థించాలని ‘శారదా తిలకం’ గ్రంథం వివరించింది.

శ్రీపంచమి పర్వదినాన సరస్వతీదేవిని ఆరాధించాల్సిన విధుల్ని శ్రీమన్నారాయణుడు నారదుడికి వివరించినట్లుగా దేవీ భాగవతం చెబుతోంది. తెల్లటి పువ్వులతో అష్టోత్తర సహితంగా బ్రాహ్మణిని పూజించి, క్షీరాన్నాన్ని నివేదన చేస్తారు. విద్యార్థులకు నూతన పుస్తకాల్ని బహూకరిస్తారు. బాల బాలికలకు అక్షరాభ్యాస వేడుకను శ్రీపంచమినాడు నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. హంసవాహినిగా, అహింసా దేవతగా వర్థిల్లుతున్న శ్రీవాణి చెంత ఉండే హంస నీటిని విసర్జించి, పాలను స్వీకరించినట్టు- వ్యక్తులు చెడును త్యజించి, మంచిని స్వీకరించాలని సందేశమిస్తుంది. విద్యాసారాన్ని అందించే శారదాంబగా, వాక్‌శక్తికి అధిష్ఠాన దేవతగా, పరావిద్యను అందించే శ్రీవిద్యగా, బ్రహ్మమానస సంచారిణి బ్రాహ్మిగా, విజ్ఞాన పెన్నిధి జ్ఞానవల్లిగా  పలు రీతులలో సరస్వతీదేవి తన విరాట్‌ వైభవాన్ని వ్యక్తీకరిస్తుంది. జీవన గమనంలో సమగ్ర జ్ఞానలబ్ధి, విద్యాసిద్ధి, సర్వతోముఖాభివృద్ధి సాకారం కావాలంటే సరస్వతి ఆరాధనే తరుణోపాయంగా చెబుతారు.