Tirumala : శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది.

Anivara Asthanam
Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా … ఉదయం బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనంద నిలయంలోని మూలవిరాట్టుకు, బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించారు.
అనంతరం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు.
తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాదవస్త్రంతో “పరివట్టం” (చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామి వారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయంగారికి, టిటిడి తరఫున కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డి గారికి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడి చేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచడంతో ఆణివార ఆస్థానం ముగిసింది.
సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారని ఈవో ఎవి.ధర్మారెడ్డి చెప్పారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వచ్చిందన్నారు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టిటిడి వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవని ధర్మారెడ్డి తెలిపారు.
టిటిడి ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి–ఏప్రిల్ నెలలకు మార్చినట్టు వివరించారు. సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకీపై స్వామి, అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని ఈవో తెలిపారు.
శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పణ
ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం నుంచి శ్రీవారికి ఆరు పట్టువస్త్రాలతో సారెను తమిళనాడు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి శ్రీ రామచంద్రన్, తమిళనాడు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ శ్రీమతి జయ, జాయింట్ కమిషనర్ శ్రీ జయరామన్, అదనపు కమిషనర్ శ్రీమతి కలైమగల్, శ్రీరంగం శ్రీ రంగనాధస్వామి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వేణుశ్రీనివాసన్‌లు కలిసి సమర్పించారు.
ఉదయం శ్రీబేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మఠం నుండి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా నాలుగు మాడ వీధుల మీదుగా ఆలయంలోనికి తీసుకువెళ్ళారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా తిరుమల ఇన్‌చార్జ్ మరియు తిరుపతి జెఈవో పోల భాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆణివార ఆస్థానం పర్వదినాన శ్రీరంగం శ్రీరంగనాధుడి చెంత నుండి తిరుమల శ్రీవారికి కానుకగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అదేవిధంగా ప్రతి ఏడాది కైశిక ఏకాదశి పర్వదినాన తిరుమల శ్రీవారి చెంత నుండి శ్రీరంగంలోని శ్రీరంగనాధస్వామివారికి కానుకగా పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు.
Also Read : Tamil Nadu Kallakurichi : తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థిని ఆత్మహత్యతో బస్సులకు నిప్పు