పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి

సూర్యాపేట : యాదవుల ఆరాధ్య దైవం కొలువుండే గొల్ల (పెద్ద) గట్టు.. లింగమంతులస్వామి జాతరకు ముస్తాబైంది. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. దేవాలయం, గట్టు ప్రాంతం విద్యుత్ కాంతులతో ధగ ధగలాడుతోంది. జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గట్టుపై లింగమంతులస్వామి ఆలయానికి రంగులు వేయడం, ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, గట్టు కింద భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 24 ఆదివారం నుంచి 28 వరకు జాతర జరుగనుంది. ఈ జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున యాదవులు తరలిరానుండటంతో అధికార యంత్రాంగం జాతరకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 10 కి.మీ దూరంలో హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవే పక్కనే దురాజ్‌పల్లి వద్ద పెద్దగట్టుపై లింగమంతులస్వామి ఆలయం ఉంది.
సమ్మక్క, సారలమ్మల జాతర తర్వాత అతిపెద్దదిగా గొల్లగట్టు లింగమంతులస్వామి జాతరకు పేరుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్, మెదక్ జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. పూర్వకాలంలో యాదవరాజులు ఉండ్రుగొండ గుట్ట మీద శివాలయం, లక్ష్మీనర్సింహస్వామి, లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి, ఆంజనేయుడి దేవాలయాలు కట్టించారని పెద్దలు చెబుతుంటారు.
సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవరపెట్టెను తీసుకొని యాదవ, రెడ్డి కులస్తులు కాలినడకన బయలుదేరి దురాజ్‌పల్లిలో ఉన్న గొల్లగట్టు (పెద్దగట్టు)కు ఆదివారం రాత్రి చేరుకుంటారు. అనంతరం పూజలతో మొదటి రోజు ఘట్టం పూర్తవుతుంది. రెండో రోజు బోనాలు, మూడో రోజు చంద్రపట్నం, నాలుగో రోజు నెలవారం, ఐదోరోజు జాతర ముగుస్తుంది.