Mokshada Ekadashi 2021 : రేపు మోక్షద ఏకాదశి
శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం మార్గశిర మాసం అని చెప్తూ ఉంటారు. మార్గశిర శుక్ల ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని అంటారు.

Mokshada Ekadashi 2021
Mokshada Ekadashi 2021 : ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది అని అందరికి తెలిసిన విషయమే… సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని చెప్పారు అంటే హిందువులకు ఈ మాసం ఎంత పవిత్రమైనదో అని తెలుస్తోంది. మోక్ష గ్రంధమైన భగవద్గీత అవతరించినది కూడా ఈ మాసంలోనే అని చెప్తూ ఉంటారు. వైష్ణవ భక్తులు నెల రోజుల పాటు తిరుప్పావై చదువుతూ పరమభక్తితో చేసుకునే ధనుర్మాసం వ్రతం కూడా ఈమాసంలోనే మొదలు అవుతుంది. ఈమాసంలో విష్ణుప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం మార్గశిర మాసం అని చెప్తూ ఉంటారు. మార్గశిర శుక్ల ఏకాదశిని మోక్షదా ఏకాదశి అని అంటారు. ఆ పేరు వినగానే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అనే విషయం అర్థమౌతుంది. మానవ జన్మ ఎత్తాక కొన్ని ఆశలు, అవసరాలు వుంటాయి గనుక వాటిని గురించి దైవాన్ని ప్రార్ధించడం జరుగుతుంటుంది. నిజానికి ప్రతి ఒక్కరి పూజలోని పరమార్ధం మోక్షాన్ని కోరడమే అవుతుంది.
పాపాలు చేస్తున్నంత కాలం మరణించడం మరలా జన్మించడం, మళ్లీ మళ్లీ కష్టాలు బాధలు అనుభవిస్తూ వుండటం జరుగుతూ వుంటాయి. అలా కాకుండా పుణ్యం చేసుకున్నట్టయితే అన్నిరకాల యాతనలకు అతీతులను చేస్తూ మోక్షం లభిస్తుంది. అయితే అంతటి పుణ్యం లభించాలంటే ఏం చేయాలనే సందేహం చాలా మందిలో కలుగుతూ వుంటుంది. అలాంటి వారందరికీ ఒక ఆశాకిరణంలా ‘మోక్షదా ఏకాదశి’ కనిపిస్తూ వుంటుంది.
‘మార్గశిర ఏకాదశి’ నే మోక్షదా ఏకాదశి గా పిలుస్తుంటారు. ఇక ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని చేయాలనుకునే వాళ్లు , ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఇంటినీ , పూజా మందిరాన్ని శుభ్రపరిచి విష్ణుమూర్తి పటాన్ని అలంకరించాలి. విష్ణుమూర్తి ప్రతిమను పంచామృతాలతో అభిషేకించి, షోడశోపచార పూజా విధానాన్ని పూర్తి చేయాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి విష్ణునామ సంకీర్తనతో జాగరణ చేయాలి. మరునాడు ఉదయాన్నే పునఃపూజ చేసి నైవేద్యం సమర్పించడంతో ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్టు అవుతుంది. పూర్వం ఈ వ్రతాన్ని వైఖాసనుడనే రాజు ఆచరించి మోక్షాన్ని పొందినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.
Also Read : Kashi Vishwanath Corridor : కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించిన ప్రధాని
మోక్షాద ఏకాదశి సమయంలో ఆచారాలు: మోక్షాద ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. ఈ రోజు ఉపవాసం ముఖ్యమైనది. మోక్షద ఏకాదశి ఉపవాసం ఏదైనా తినకుండా , తాగకుండా రోజు గడపడం. ఏకాదశి తిథి సూర్యోదయం నుండి ద్వాదశి తిథి సూర్యోదయం వరకు 24 గంటల పాటు ఉపవాసం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ వ్రతాన్ని మతపరంగా పాటిస్తున్న వ్యక్తి మరణం తరువాత మోక్షం పొందుతాడనేది ఒక ప్రసిద్ధ నమ్మకం. కఠినమైన ఉపవాసం పాటించలేని వారికి పాలు, పాల ఉత్పత్తులు, పండ్లు మరియు ఇతర శాఖాహార ఆహారాలు తినడం ద్వారా పాక్షిక ఉపవాసం కూడా అనుమతించబడుతుంది. గర్భిణీ స్త్రీ కూడా ఈ రకమైన ఉపవాసాలను పాటించవచ్చు. మోక్షదా ఏకాదశి వ్రతాన్ని పాటించని వారికి కూడా బియ్యం , ధాన్యాలు , పప్పుధాన్యాలు , ఉల్లిపాయ , వెల్లుల్లి తినడం నిషేదం. ఈ వ్రతం చేసేవారు పూజ యొక్క అన్ని ఆచారాలను అనుసరించి శ్రీకృష్ణుడికి పూజలు చేస్తారు. సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శిస్తారు. మోక్షాద ఏకాదశి సందర్భంగా ‘భగవద్గీత’, ‘విష్ణు సహస్రనామం’, ‘ముకుందష్టకం’ చదవడం శుభంగా భావిస్తారు.