జనవరి 15 నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 15 నుండి తిరిగి సుప్రభాత సేవ తిరిగి ప్రారంభం కానుంది. పవిత్రమైన ధనుర్మాసం మంగళవారం జనవరి 14తో ముగియనుండడంతో బుధవారం జనవరి15 నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవలు టీటీడీ ప్రారంభించనుంది.
గత ఏడాది డిసెంబరు 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం అయ్యింది. డిసెంబరు 17వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. కాగా జనవరి 14వ తేదీ ధనుర్మాసం పూర్తికావడంతో, జనవరి 15వ తేదీ బుధవారం నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
జనవరి 16వ తేదీన ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేట మండపం వద్ద పార్వేట ఉత్సవం జరుగనున్నాయని టీటీడీ ప్రజాసంబంధాల అధికారి ఓ ప్రకటనలో వెల్లడించారు.