Hanuman Birthplace TTD : మారుతి మనవాడే అంటున్న టీటీడీ

అభయం ఇవ్వడం.. ఆనందం పంచడం.. హనుమంతుడి పేరు తలుచుకుంటే మనసులో స్పురించే మాటలు ఇవి ! అఖండ తేజోవంతుడిగా, దాసభక్తికి స్వరూపుడిగా, సకల గుణ సంపన్నుడైన హనుమాన్ జన్మస్థలం ఏంటన్న దానిపై ఎలాంటి ఆధారం లేదు.

Hanuman Birthplace TTD : మారుతి మనవాడే అంటున్న టీటీడీ

Ttd Declares 'anjanadri' In Tirumala Is Hanuman's Birthplace

Updated On : April 21, 2021 / 7:45 PM IST

Anjanadri Hanuman’s birthplace : అభయం ఇవ్వడం.. ఆనందం పంచడం.. హనుమంతుడి పేరు తలుచుకుంటే మనసులో స్పురించే మాటలు ఇవి ! అఖండ తేజోవంతుడిగా, దాసభక్తికి స్వరూపుడిగా, సకల గుణ సంపన్నుడైన హనుమాన్ జన్మస్థలం ఏంటన్న దానిపై ఎలాంటి ఆధారం లేదు. ఐతే మారుతి మనవాడే అంటూ జన్మస్థలం ప్రకటించింది టీటీడీ. హనుమంతుడు సర్వ దేవతా స్వరూపుడు. పరమ రామభక్తి, మహా వీరత్వం, జ్ఞానం, తెలివితేటలు, ధైర్యం, వినయం.. ఇలా ఎన్నో అద్భుతమైన అనంతమైన సుగుణాలతో ప్రతీ ఒక్కరి మనస్సులో స్ఫురించే దైవం మారుతి. భక్తి, యుక్తి, శక్తి, త్రివేణీ సంగమంలా సంగమించిన తత్వం హనుమంతునిది. సీతారాములకు ప్రాణదాత. మూర్తీభవించిన దాసభక్తి స్వరూపుడు. కార్య దీక్షాపరుడు.. మానవజాతికి మార్గదర్శకుడు, అభయప్రదాత ఆంజనేయస్వామి. లోక కల్యాణార్థం సీతారాముల కల్యాణాన్ని జరిపించినవాడు విశ్వామిత్రుడైతే… విడిపోయిన జంటను మళ్లీ కలిపి జగత్ కల్యాణం గావించినవాడు ఆంజనేయుడు. అభయం, ఆనందం భక్తులకు హనుమ అందించే రెండు వరాలు.

సమస్త మానవాళికి ఆదర్శనీయం హనుమంతుడి జీవితం. అనుకరణీయమైన, ఆరాధించదగిన దైవత్వం కలబోసిన ఈశ్వరతత్వమే ఆంజనేయస్వామి. భయపడిన సుగ్రీవుడికి ధైర్యం నింపాడు. అశోకవనంలో శోకసంద్రంలో మునిగిపోయిన సీతకు రాముడి సందేశాన్ని చేర్చి సంతోషపరిచారు. సంజీవని పర్వతాన్ని మోసుకొచ్చి లక్ష్మణుని ప్రాణాలు నిలబెట్టి రాముడిని ఆనందపరిచారు. ఇలా అభయాంజనేయునిగా.. ఆనందాంజనేయునిడిగా సకల ప్రదాతగా భక్తుల పూజలు అందుకుంటున్నారు మారుతి ! ఐతే ఆయన జన్మ వృత్తాంతం గురించి తెలిసినా.. ఎక్కడ పుట్టారన్న దానిపై వివాదం ఏళ్లుగా కొనసాగుతోంది. ఐతే మారుతి మనవాడే అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం.. జన్మస్థలంపై ఆధారాలు ప్రకటించింది.

అంజనాద్రి పర్వతంపైనే జన్మించినట్లు ప్రకటన :
కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం ఆంజనేయుడి జన్మస్థలంపై ఇన్నాళ్లుగా కొనసాగుతూ వస్తోన్న వివాదాలకు తెర దించింది తిరుమల తిరుపతి దేవస్థానం. హనుమంతుడు.. అంజనాద్రి పర్వతంపైనే జన్మించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని శాస్త్రీయబద్ధంగా నిరూపించింది. ఇన్నాళ్లూ కర్ణాటకలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రాచీన, పర్యాటక కేంద్రం హంపి సమీపంలోని కిష్కింధ దగ్గర గల ఆంజనేయ బెట్టను హనుమంతుడి జన్మస్థలంగా భావిస్తూ వచ్చారు. దాన్ని ఎవరూ శాస్త్రీయంగా నిర్ధారించలేకపోయారు. ఐతే ఇప్పుడు అంజనాద్రి పర్వతమే వాయుసుతుడి జన్మస్థలంగా టీటీడీ ప్రకటించింది.

తిరుమలగిరుల్లోని ఓ పర్వతం అంజనాద్రి :
ఆంజనేయ స్వామివారి జన్మస్థలంపై కొంతకాలంగా చర్చలు సాగుతున్నాయి. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేస్తామని టీటీడీ అధికారులు ఆ మధ్య ప్రకటించారు. చెప్పినట్టుగానే ఈ అంశంపై ఓ ప్రకటన చేశారు. అంజనాద్రి పర్వతమే ఆంజనేయుడి జన్మస్థలమని తెలిపారు. అంజనాద్రి.. సాక్షాత్ శ్రీమహావిష్ణువు కొలువై ఉన్నాడని భావించే తిరుమలగిరుల్లోని ఓ పర్వతం. ఆంజనేయుడి తల్లి అంజన పేరు మీదే వెలసింది. తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయం ఆనంద నిలయానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకాశగంగ సమీపంలో ఉంటుందీ అంజనాద్రి పర్వతం.

తిరుమల ఏడుకొండలను వృషభాద్రి, వృషాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, శేషాద్రి. వేంకటాద్రి, నారాయణాద్రిగా పిలుస్తారు. అందులో ఒకటైన అంజనాద్రి పర్వతమే ఆంజనేయుడి జన్మస్థలమని టీటీడీ ప్రకటించింది. హనుమంతుడి జన్మస్థానం ఏదన్న విషయంపై అన్వేషణ సాగించడానికి టీటీడీ ఇదివరకే ఓ కమిటీని నియమించింది. దీనికి జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీధర శర్మ నేతృత్వం వహించారు. ఇందులో శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాల‌యం వైస్ ఛాన్సలర్ స‌న్నిధానం సుదర్శన‌ శ‌ర్మ‌, స‌దాశివ‌మూర్తి, జాన‌మ‌ద్ది రామ‌కృష్ణ‌, శంక‌ర‌నారాయ‌ణ‌, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావ‌స్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజ‌య్‌కుమార్ స‌భ్యులుగా ఉన్నారు.

ఎస్వీ ఉన్నత వేదాధ్యయ‌న సంస్థ ప్రాజెక్టు అధికారి ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ క‌న్వీన‌ర్‌గా వ్యవ‌హ‌రించారు. హనుమంతుడి జన్మస్థలంపై ఈ కమిటీ ప‌రిశోధ‌నలు సాగించింది. నాలుగు నెలల పాటు వారి అన్వేషణ సాగింది. శాస్త్రీయ ఆధారాలను సేకరించింది. హ‌నుమంతుడు అంజ‌నాద్రిలోనే జ‌న్మించాడ‌ని రుజువు చేయడానికి అవసరమైన ఆధారాలను సేక‌రించింది. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా వాటిని వెల్లడించిందా కమిటీ.