Vaikunta Ekadasi : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి.. ఆలయాలకు పోటెత్తిన భక్తజనం
Vaikunta Ekadashi 2025: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైష్ణవాలయాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయాలను తెరచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ..

Vaikunta Ekadashi 2025
Vaikunta Ekadasi 2025: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైష్ణవాలయాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయాలను తెరచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు అనంతరం తెల్లవారు జామున 4.30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమల ఆలయం అందంగా ముస్తాబైంది. రకరకాల పుష్పాలతో శ్రీవారి ఆలయం ముస్తాబు చేశారు. తిరుమల శ్రీవారిని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, మంత్రులు సవిత, పార్థసారథి, నిమ్మల రామానాయుడు, రాందేవ్ బాబా తదితరులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
ఏలూరులోని ద్వారకా తిరుమల ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. విశాఖపట్టణంలోని సింహాచలం ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వారాలు తెచుకున్నాయి. దీంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామున 5గంటల నుంచి భక్తులకు స్వామివారు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
యాదగిరిగుట్టలో స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. అదేవిధంగా ధర్మపురి నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో కన్నుల పండువగా ముక్కోటి ఏకాదశి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆలయాలకు గురువారం రాత్రి నుంచే భక్తులు పోటెత్తడంతో వారికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
శ్రీశైలంలో వైకుంఠ ఏకాదశి సందడి నెలకొంది. తెల్లవారు జామునుంచే స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్నారు. స్వామి, అమ్మవార్లకు రావణ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. సాయంత్రం పుష్పార్చన సేవ ఉంటుంది. 40 రకాల 4వేల టన్నుల పుష్పాలతో అర్చకులు పుష్పార్చన సేవలో పాల్గొంటారు.