టీమిండియాకు రూ.125 కోట్లు.. భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్ లు, సహాయక సిబ్బందికి అభినందనలు తెలిపారు జై షా.

టీమిండియాకు రూ.125 కోట్లు.. భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ

125 Crore For Team India : టీ-20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టీమిండియాకు 125 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు బీసీసీఐ సెక్రటరీ జై షా. ఈ మేరకు జై షా కీలక ప్రకటన చేశారు. టోర్నీ మొత్తం భారత జట్టు అసాధారణ ప్రతిభ, నిబద్ధత, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిందని ఆయన ప్రశంసించారు. అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ప్లేయర్లు, కోచ్ లు, సహాయక సిబ్బందికి అభినందనలు తెలిపారు జై షా.

”ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024ను గెలుచుకున్నందుకు భారత క్రికెట్ జట్టుకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నా. టోర్నమెంట్ అంతటా జట్టు అసాధారణమైన ప్రతిభ, క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. అత్యుత్తమ విజయానికి గాను ఆటగాళ్లు, కోచ్‌లు మరియు సహాయక సిబ్బందికి నా అభినందనలు” అని X లో ట్వీట్ చేశారు జై షా.

ఒక్క ఓటమి కూడా లేదు..
టీ20 వరల్డ్ కప్ విజేత భారత్.. ఈ టోర్నీలో మరో ఘనత సాధించింది. టీ20 వరల్డ్ కప్ టోర్నీ మొత్తం ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ప్రపంచ కప్ సాధించిన తొలి టీమ్ గా భారత్ చరిత్ర సృష్టించింది. గ్రూప్ దశలో ఐర్లాండ్, పాకిస్తాన్, యూఎస్ఏ.. సూపర్-8లో అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా.. సెమీస్ లో ఇంగ్లండ్, ఫైనల్ లో సౌతాఫ్రికాను ఓడించింది భారత జట్టు. ఇక, టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో తొలుత బ్యాటింగ్ చేసి రెండు సార్లు (2007, 2024) కప్ సాధించిన ఏకైక జట్టుగానూ టీమిండియా నిలిచింది. మిగతా 6 సందర్భాల్లోనూ రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే విజేతలుగా నిలవడం విశేషం.

Also Read : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో టీమ్ఇండియా విజ‌యానికి 5 ప్ర‌ధాన కార‌ణాలు ఇవే..