రాయుడు లైఫ్‌లో స్పెషల్ అచీవ్‌మెంట్.. రైనా, CSKల విషెస్

రాయుడు లైఫ్‌లో స్పెషల్ అచీవ్‌మెంట్.. రైనా,  CSKల విషెస్

Updated On : July 13, 2020 / 5:57 PM IST

టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌, ముక్కు సూటిగా పోయే చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ ప్లేయర్ అంబటి రాయుడు కొత్త ఇన్నింగ్స్ మొదలైంది. అంబటి సతీమణి విద్య ఆదివారం డెలివరీ కావడంతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అంబటి తన గారాల పట్టిని చిరునవ్వుతో ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తూ ఫొటో పెట్టాడు

దీన్ని చెన్నై సూపర్‌కింగ్స్‌ తెలియజేసింది. తమ స్టార్ ప్లేయర్ రాయుడు, విద్య, చిన్నారి ఉన్న చిత్రాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ‘డాడీస్‌ ఆర్మీ నుంచి మైదానం బయట నేర్చుకున్నవి అన్ని పాఠాలూ ఇప్పుడు ఉపయోగించాల్సిందే’ అంటూ సరదాగా రాసుకొచ్చింది.

చెన్నై జట్టు సీనియర్‌ ప్లేయర్ సురేశ్‌ రైనా టీమ్ మేట్ రాయుడికి అభినందనలు తెలియజేశాడు. ‘చక్కని కుమార్తెకు జన్మనిచ్చినందుకు రాయుడు, విద్యకు హృదయపూర్వక అభినందనలు. ఇదో అద్భుత ఆశీర్వాదం! చిట్టితల్లితో ప్రతి క్షణం, ప్రతి సందర్భాన్ని ఆనందించండి. మీరెప్పుడూ ప్రేమ, సంతోషంతో గడపాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్‌ చేశాడు.

ఐపీఎల్ లోని అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. అందులో సీనియర్‌ ఆటగాళ్లంతా 35 ఏళ్లు దాటినవారే. టోర్నీ జరిగే సమయంలో వారి డ్రెస్సింగ్‌ రూమ్‌ భార్యా, పిల్లలతో కళకళలాడిపోతూ ఉంటుంది. 2019 ప్రపంచకప్‌నకు ఎంపికకాని రాయుడు ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఐపీఎల్‌లో తన సత్తా నిరూపించుకుందామని తహతహలాడుతున్నప్పటికీ కరోనా కారణంగా టోర్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.